ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులు పూర్తి నాణ్యతతో పాటు, ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య అన్నారు. మంగళవారం తన ఛాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద చెరువు, అయ్యకోనేరు, నీలాటి చెరువు, కోమటి చెరువు లను పరిశుభ్రతగా ఉంచాలన్నారు. ఆచంట గార్డెన్ గోడలకు, పెద్ద చెరువు గ్రిల్స్‌కు పెయింటింగులు వేయించాలని సూచించారు. సమావేశంలో ఎంఇ టి. రాయల్ బాబు, టెక్నికల్ ఆఫీసర్ పట్నాల వెంకటేశ్వరరావు, డిఇలు ప్రసాద్, మణికుమార్, ఎఇలు పాల్గొన్నారు.రక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడమే ప్రధాన ధ్యేయమని కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. మంగళవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా కొత్త అగ్రహారంలో ఉన్న వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. ప్రతి 15 రోజులకు ఓసారి వాటర్ ట్యాంక్ శుభ్రపరుస్తున్నారా లేదా అని గమనించారు. పైపులైను లీకులను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఫిట్టర్‌కు ఆదేశించారు. ప్రతిరోజు నీటి నాణ్యతను పరీక్షించే క్లోరిన్ టెస్టులు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సు తప్పనిసరి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి ట్రేడ్ లైసెన్సులు తప్పనిసరి అని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. కమిషనర్ ఆదేశాలతో సచివాలయాల వారీగా ఆయా పరిధిలో ఉన్న దుకాణాలకు కార్యదర్శులు వెళ్లి ట్రేడ్ లైసెన్సులు పొందని వారికి లైసెన్సు విధానంపై అవగాహన కల్పిస్తూ ట్రేడ్ లైసెన్సులను మంజూరు చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ విధానం శతశాతం అమలయ్యే విధంగా చూడాలని సిబ్బందికి ఆదేశించామన్నారు. బకాయి పడ్డ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ ను వెంటనే చెల్లించాలని సూచించారు.