పలు ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటన

Nov 28,2024 20:43

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్‌ పల్లి నల్లనయ్య పర్యటించారు. ముందుగా జ్యోతిరావు పూలే,సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్దనున్న ఫౌంటెన్‌ పరిసరాలను పరిశీలించారు. తర్వాత వాటర్‌ ట్యాంక్‌ వద్దకు చేరుకొని అక్కడ ట్యాంకర్ల ద్వారా వచ్చిన క్లోరిన్‌ డబ్బాలలో నింపడాన్ని గమనించారు. అయితే నాణ్యతతో కూడిన క్లోరిన్‌ దిగిమతి అవుతుందా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింహాచలం మేడ సమీపంలో పాన్‌ షాప్‌ వద్దనున్న గుట్కా, మసాలా వంటి నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సామూహిక మరుగుదొడ్ల వద్దకు వెళ్లి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అక్కడ ఉన్న ప్రజలకు సూచించారు.

సీతాఫలాల అమ్మకాలపై దాడులు

నగరంలో ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే విధంగా పురుగులతో కూడిన సీతాఫలాల విక్రయాల పై తనిఖీలు చేపట్టి వాటిని సీజ్‌ చేశామని నగరపాలక సంస్థ కమిషనర్‌ పల్లి నల్లనయ్య తెలిపారు. ఈమధ్య మార్కెట్లో సీతాఫలాలు విరివిగా వస్తున్నాయని, అయితే వాటిలో పురుగులు ఉన్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. పలువురు ఫిర్యాదు చేసిన అనంతరం ప్రజారోగ్య సిబ్బందితో తనిఖీలు నిర్వహించామని చెప్పారు. సదరు సీతాఫలాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించి, వాటిని సీజ్‌ చేసామన్నారు. అటువంటి సీతాఫలాలను మార్కెట్లో తెచ్చి విక్రయించరాదని వ్యాపారులకు సూచించారు. పురుగులతో కూడిన సీతాఫలాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తాయని స్పష్టం చేసారు.

➡️