నష్టపోయిన రైతులకు పరిహారం పెంచాలి

Mar 10,2025 21:25

ప్రజాశకి-విజయనగరం టౌన్‌  : పెందుర్తి నుంచి బొడ్డవర రోడ్డు, ఎస్‌.కోట బైపాస్‌ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం లేదా, భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ భూ పోరాట కమిటీ ఆధ్వర్యాన కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు బి.రాంబాబు మాట్లాడుతూ ఎస్‌.కోట మండలం వెంకట రమణ పేట, కొత్తూరు, ఎస్‌.కోట, సీతంపేట గ్రామాలకు చెందిన రైతులు సన్న, చిన్న కారురైతులు ఉన్న కొద్దిపాటి భూమిని కోల్పోతున్నారని, ఇప్పటికే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువలో కూడా కొంత భూములు పోతున్నాయని తెలిపారు. జీవనాధారం కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని, లేదంటే ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. హై వే పోరాట కమిటీ కో కన్వీనర్‌ గొంప కృష్ణమూర్తి , రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మద్దిల రమణ, వసంత సత్యారావు, పిల్లల రమణ, పొలమరశెట్టి సూరి బాబు, అశోక్‌, వి.అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️