ప్రజాశక్తి – ఆదోని : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంబల్ పట్టణంలో మసీదు సర్వే సందర్భంగా పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ముస్లిం జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ నాయకులు ఎంహెచ్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షులు జూనైద్, ఎస్ డి పి ఐ ఆదోని అధ్యక్షులు గౌస్ ఖాన్ మాట్లాడారు. మసీదు సర్వే సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలో ఐదుగురు ముస్లిం యువకులు మృతి చెందారు. ఈ ఘటన పై ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. కాల్పుల్లో మృతిచెందిన ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలని, విచక్షణ రహితంగా కాల్పులకు పాల్పడిన పోలీసులపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ముస్లిం జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. 1991 ప్రార్థన స్థలాల చట్టం కింద 1947కు పూర్వం ఉన్న గుడిలో, మసీదుల జోలికి వెళ్లరాదని కిందికోర్టులకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కూడా ఈ వినతి పత్రం ద్వారా కోరుతున్నామన్నారు.
గత 11 ఏళ్లుగా బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వైఫల్యాలను తన మిత్రుల దోపిడీ నుంచి ప్రజల దృష్టి మరలించడానికి మత కలహాలను బిజెపి ఒక ఆయుధంగా వాడుకోవడం సిగ్గుచేటు అని ఆరోపించారు. దేశంలో నాయకులు,అధికారులు, కొంతమంది పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించడం రాజ్యాంగాన్ని అవమానించడం పరిపాటిగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను మసకబారుస్తోందని,
కులమతాలకతీతంగా రాజ్యాంగ రక్షణకు, చట్టబద్ధమైన పాలన రక్షణకు నడుం బిగించాలని హితువు పలికారు. రాబోయే రోజుల్లో ఆదోనిలో అన్ని వర్గాల సామాన్య ప్రజల సమస్యలపై పోరాటానికి ముస్లిం జే. ఏ. సి. కలుపుకొని ముందుకు పోతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మైనారిటీ విభాగం మాజీ అధ్యక్షులు నూర్ మొహమ్మద్, మానవ హక్కుల సంఘం నాయకులు జిక్రియా , సమన్వయకర్తలు సద్దాం హుస్సేన్, ఖాదర్ బాషా తదితరులు ఉన్నారు.