ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.శ్రీనివాసరావు, గాడి అప్పారావు డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గిరిజన యూనివర్సిటీ నిర్వాసితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెంటాడ మండలం కుంటినవలసలో గిరిజన యూనివర్సిటీ నిర్మాణానికి 560 ఎకరాలు భూమిని సేకరించారని, పోరాట ఫలితంగా రైతులకు పరిహారం ఇచ్చినా కొన్ని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. ముఖ్యంగా భూమిపై ఉన్న టేకు, మామిడి తదితర మొక్కలకు డబ్బులు చెల్లించకుండా అన్యాయం చేశారన్నారు. నలుగురు డి పట్టా దారులకు నష్టపరహారం అసంపూర్ణంగా ఇచ్చారన్నారు. తక్షణమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిఆర్‌ఒకి వినతి ఇచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, నిర్వాసిత నాయకులు లింగాల వెంకట్రావు, చాకలి కృష్ణా, ఫైలు రాములు పాల్గొన్నారు.