సమీక్షలో మాట్లాడుతున్న కలెక్టర్ అరుణ్‌బాబు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : జిల్లాలోని 59 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో (పిఎసిఎస్) కంప్యూటరీకరణను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. నరసరావుపేటలోని కలెక్టరేట్‌లో 5వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నిర్వహించగా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించి మాట్లాడారు. 21 నుండి జిల్లాలోని 59 పిఎసిఎస్‌లు ఈ-పిఎసిఎస్‌లుగా మారాలన్నారు. ఏ సొసైటీలోనైనా ఓచర్ జనరేషన్‌లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడాది కాలంగా సంఘాల కంప్యూటీకరణ జరుగుతున్నా పురోగతి సరిగా లేదన్నారు. సరిగా పనిచేయని సంఘ సీఈఓలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని జిల్లా సహకార అధికారి గుంటూరు కేంద్ర సహకార బ్యాంకు సిఈఓ కృష్ణవేణిని ప్రశ్నించారు. కంప్యూటీకరణ పూర్తిచేసే విషయంలో పని చేయని వారిపై ఈనెల 21న చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాథమిక సహకార సంఘాలలో జరుగుతున్న పురోగతిపై సుదీర్ఘంగా చర్చించి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల కామన్ సర్వీస్ సెంటర్లుగా అన్ని సేవలు రైతులకు సకాలంలో అందించాలన్నారు. ఆధార్ ఎన్రోల్మెంట్ సిఎస్‌సి సెంటర్‌లను సిద్ధం చేయాలన్నారు. ఈపూరు, పాకాలపాడు సంఘాలలో కోల్డ్ స్టోరేజీల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సంఘాల పరిధిలోని మల్టిపర్పస్ గోదాములు ఖాళీగా ఉంచకుండా రైతుల వారి పంటలు నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 10 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు ఏర్పాటుకు ఆమోదిస్తూ పురోగతి చూపాలని సంబంధిత ఏరియా మేనేజర్లను కోరారు. అవసరమైన చోట మల్టిపర్పస్ గోడౌన్లను గ్యాస్ గోడౌన్లుగా మార్పు చేసేందుకు ఆమోదం తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో ఎన్‌పిఎ (నిరర్ధక ఆస్తులు) వసూళ్లను ఈ నెలలోగా 80 శాతం, జూన్ నాటికి 100 శాతం పూర్తి చేయాలని బ్యాంక్ సిఈఓను ఆదేశించారు. ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల నుండి డిసెంబర్ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. సమావేశంలో కమిటీ కన్వీనర్, జిల్లా సహకార అధికారి ఎం.వెంకటరమణ, నాబార్డ్ డిడిఎం శరత్, డిఆర్‌డిఎ పీడీ హీరాలాల్, జిల్లా పంచాయతీ అధికారి భాస్కరరెడ్డి, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కాంతారావు, జిల్లా మత్స్య శాఖాధికారి సంజీవరావు, నరసరావుపేట డివిజినల్ సహకార అధికారి నాగ శ్రీనివాస్, జిల్లా సహకార ఆడిట్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
