ముగిసిన రెవెన్యూ సదస్సులు

Jan 8,2025 21:12

జిల్లా వ్యాప్తంగా 6,754 దరఖాస్తులు

పట్టాదారు పాస్‌పుస్తకాల కోసమే 4,854 అర్జీలు

మొత్తంగా రెవెన్యూ సమస్యలే ఎక్కువ

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : గత నెల 6న మొదలైన రెవెన్యూ సదస్సులు బుధవారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 983 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఇందులో 40, 320మంది జనం పాల్గొన్నట్టు అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ సదస్సుల్లో 8వ తేదీ ఉదయం వరకు 6,764 దరఖాస్తులు అందినట్టు అధికారిక సమాచారం. ఇందులో అత్యధికంగా పట్టాదారు పాస్‌పుస్తకాల కోసం 4,854 అర్జీలు అందాయి. రీసర్వేలో తలెత్తిన సమస్యలు పరిష్కరించాలని 345, సరిహద్దు సమస్యలను ప్రస్తావిస్తూ 2,68, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, తప్పుల సరవణ చేయాలని 250మంది, తమ పట్టాలను సబ్‌ డివిజన్‌ చేయాలని మరో 143మంది అర్జీలు పెట్టుకున్నారు. మిగిలిన వాటిలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇనాం భూముల సమస్యలు, రోడ్ల నిర్మాణాలకు ఎదురౌతున్న ఇబ్బందులు తదితరాలపై అర్జీలు అందాయి. మొత్తం అర్జీల్లో ఇప్పటికే 2,468 దరఖాస్తులకు పరిష్కారం చూపినట్టు అధికారులు చెబుతున్నారు. మిగిలిన 4,296 దరఖాస్తులు నిర్థిష్టమైన కాలపరిమితిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నారు. అందిన దరఖాస్తుల్లోనూ ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబీకులే ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు అప్పటి టిడిపి ప్రభుత్వం చేపట్టిన వెబ్‌ ల్యాండ్‌ నమోదులో తప్పుల తడకలు, 2019 -2024 మధ్య వైసిపి ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న సమగ్ర భూసర్వేలో జరిగిన తప్పిదాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రీసర్వేలో జరిగిన లోపాల వల్ల గ్రామాలకు గ్రామాలే 22ఎలోకి వెళ్లాయి. వీటిని ఫ్రీహోల్డ్‌ చేయాలని అధికారులకు ఎన్నోసార్లు బాధిత గ్రామాల ప్రజలు మొరపెట్టుకున్నా పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు. దీంతో, క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. ఆయా భూములపై గతంలో తీసుకున్న వ్యవసాయ రుణాలు, ముద్ర లోనులు రీషెడ్యూల్‌ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. అన్నదమ్ముల మధ్య భూమి పంపకాలు సమానంగా ఉన్నప్పటికీ రికార్డుల్లో మాత్రం హెచ్చుతగ్గులు చూపిస్తున్నారు. దీనికి తోడు వెబ్‌ ల్యాండ్‌ నమోదులో జరిగిన తప్పిదాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో, చాలా మందికి 1బిలు రావడం లేదు. ఫలితంగా రుణాలు పొందలేక పోతున్నారు. ఇక గ్రామాలు, వాటి మధ్య లింకు రోడ్లు, చెరువులు చాలా వరకు ఆక్రమణకు గురయ్యాయి. కుల ధ్రువీకణ పత్రాలకు కూడా వందలాది మంది ఇబ్బంది పడుతున్నారన్న విషయం ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా మరోసారి స్పష్టమైంది. జిరాయితీ భూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదు కావడంతో చాలా మంది ఇబ్బందులకు గురౌతున్నారు.

45రోజుల్లో పరిష్కారం

వివిధ సమస్యలపై రెవెన్యూ సదస్సుల్లో అందిన అర్జీల్లో 36.49శాతం పరిష్కరించాం. మిగిలిన 63.31 శాతంలో సమస్య స్వభావాన్ని బట్టి 45రోజు ల్లోపు పరిష్కారమవు తాయి. ఈ విధంగా ప్రభుత్వ ఇదేశాలు కూడా ఉన్నాయి. అర్జీదారుడి సమస్యలకు పరిష్కారం చూపి సంతృప్తి పర్చడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తుంది.

ఇ.మురళి, రెవెన్యూ సదస్సుల నోడల్‌ ఆఫీసర్‌ కెఆర్‌సిసి ఎస్‌డిసి,

విజయనగరం జిల్లా

➡️