ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల మరణించిన హోంగార్డు , పోలీసు కానిస్టేబులు కుటుంబాలకు ఎస్‌పి వకుల్ జిందల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్థిక చేయూత అందించారు. ఉమ్మడి జిల్లాలోని బలిజిపేట పోలీసు స్టేషనులో హోంగార్డుగా పని చేస్తున్న బి.నారాయణస్వామి ఆకస్మికంగా డిసెంబరు 6న మరణించగా, ఆ కుటుంబానికి రూ.3,30,150 చెక్ ను ఆయన సతీమణి బి. శారదకు, విజయనగరం జిల్లాలో కానిస్టేబులుగా పని చేస్తూ, కె.తిరుపతి నాయుడు అనారోగ్య కారణాలతో నవంబరు 9న మరణించగా, రూ.1,48,300 చెక్ ను ఆయన సతీమణి కె.నారాయణమ్మకు ఎస్‌పి అందజేశారు. ప్రభుత్వం నుండి రావాల్సిన బెనిఫిట్స్, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం సకాలంలో కల్పించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి పి.సౌమ్యలత, డిపిఒ సూపరింటెండెంట్ ఎ.ఎస్.వి.ప్రభాకర రావు పాల్గొన్నారు.
డిజిటల్ అరెస్టు పట్ల అవగాహనకు పోస్టర్ ఆవిష్కరణ
డిజిటల్ అరెస్టు పట్ల ప్రజలను జాగృతం చేసి, వారిలో అవగాహన కల్పించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సు టూల్స్ వినియోగించి ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రం పోస్టర్‌ను ఎస్‌పి వకుల్ జిందల్ మంగళవారం పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రజలకు డిజిటల్ అరెస్టు పట్ల అవగాహన కల్పించేందుకు షార్టుఫిల్మ్ ను రూపొందించి, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువ చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బి సిఐ ఎ.వి.లీలారావు, కానిస్టేబులు బి.రాంబాబు పాల్గొన్నారు.