విద్యుత్‌ రంగ పరిరక్షణ కోసం 22న సదస్సు

Dec 13,2024 23:57

ప్రజాశక్తి-చిలకలూరిపేట : జాతీయ ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా నేషనల్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ ఆఫ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఇంజినీర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద గల ఎడిఇ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు. సిఐటియు మండల కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్‌, చండిఘర్‌ రాష్ట్రాల్లో కార్మికులు పోరాడుతున్నారని చెప్పారు. వారికి అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జె.రాజశేఖర్‌ మాట్లాడుతూ నాలుగేళ్లుగా చండీగఢ్‌ రాష్ట్రంలో విద్యుత్‌ సంస్థను ప్రైవేటీకరించడం కోసం అనేకసార్లు ప్రయత్నాలు చేశారని, అక్కడి కార్మికవర్గం ఐక్యంగా తిప్పికొట్టిందని తెలిపారు. అయితే ఉద్యోగులను క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు అదునుచూసి విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించపూనుకున్నారని వివరించారు. కాంట్రాక్టు వర్కర్లు, రెగ్యులర్‌ కార్మికులు ఐక్యంగా నిలబడి పోరాడుతున్నారని తెలిపారు. రాత్రివేళల్లో చలిని సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులతో ఉద్యమిస్తున్నారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో డిస్కంలను కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ రంగంలోని కార్మికులు, ఉద్యోగులు అందరూ ఎన్‌సిసిఒ ఇఇఇ పిలుపు మేరకు ఈనెల 22న కడపలో జరిగే ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందర్నీ రెగ్యులర్‌ చేయాలని, 2022 పిఆర్సీని ఇవ్వాలని, 2019 నుండి పనిచేస్తు న్న కార్మికులకు పాత ఆపరేటర్స్‌తో సమానంగా కొత్త ఆపరేటర్స్‌ కూడా వేతనాలు చెల్లించాలని, ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ అందరికీ స్కిల్డ్‌ వేతనం ఇవ్వాలని, పెయిడ్‌ హాలిడేస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట సబ్‌ డివిజన్‌ ఎడిఇ అశోక్‌కుమార్‌, డి2 ఏఈ, ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు.

➡️