రాయలసీమ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు అభినందన

Dec 9,2024 18:08 #Kurnool

ప్రజాశక్తి – కర్నూలు జిల్లాపరిషత్ : గత నెల 26 నుండి 30 వరకు వి టీ యు బెళగావి ఆధ్వర్యంలో ఇటీవల ముగిసిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళల టోర్నమెంట్‌లో రాయలసీమ విశ్వవిద్యాలయం బ్యాడ్మింటన్ మహిళా జట్టు 3వ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 2024 – 25 సంవత్సరానికి గాను ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌కు ఈ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు అర్హత సాధించింది. ఈ సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం క్రీడాకారులు, కోచ్‌లకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్‌ టి కె నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి విజయ కుమార్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు జట్టు సభ్యులకు ధన్యవాదాలు తెలిపి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో విజేతలుగా తిరిగి రావాలని కోరారు. ఆల్ ఇండియా – ఖేలో ఇండియాకు వరుసగా మూడుసార్లు అర్హత సాధించిన ఏకైక విశ్వవిద్యాలయం మనదే అని, మరే ఇతర ఏపి విశ్వవిద్యాలయాలు ఈ ఘనత సాధించలేదని పేర్కొన్నారు. యూనివర్శిటీకి ఖ్యాతి తీసుకొచ్చినందుకు వైస్ ఛాన్సలర్ జట్టు సభ్యులను జ్ఞాపికలతో సత్కరించారు.
అలాగే ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌ను ఏప్రిల్ లేదా మే నెలలలో నిర్వహిస్తారు అని ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెవి శివ కిషోర్ తెలియజేశారు. టోర్నమెంట్ కోసం ఆటగాళ్లు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ విజయ కుమారి పాల్గొన్నారు.

➡️