ప్రజాశక్తి – కడప : కూటమి ప్రభుత్వంలో మహిళల కు రక్షణ కరువైందని కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి.విజయ జ్యోతి అన్నారు. పోలీసు అధికారినే రక్షించలేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.విజయనగరం జిల్లా, వేపాడ మండలం, గుడివాడ గ్రామంలోని వేణుగోపాల స్వామి తీర్థం వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారి దేవిని యువకులు దూషించడం, విధుల్లో ఉన్న మహిళా పోలీస్ అధికారిని జుట్టు పట్టుకొని పక్కకు లాగేసారు, ఫోన్ లాక్కొని, ఆమె చేతులు లాగుతూ, దుర్భాషలాడుతూ దాడి చేశారు అన్నారు. ఆమె భయంతో పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు దాక్కున్నారని తెలిపారు. పోలీస్ వ్యవస్థలో మహిళలకు కూడా రక్షణ లేని దుస్థితిని ఈ కూటమి ప్రభుత్వం వెల్లడిస్తుందన్నారు.ఇటువంటి పరిస్థితుల్లో సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందని అన్నారు.ఇటీవల కడప జిల్లా లో జరిగిన మరికొన్ని ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిగూఢంగా బయటపెడుతున్నాయి అన్నారు.కమలాపురం లో గురువారం రోజున కారం గూడి లక్ష్మీదేవి అనే మహిళపై దుండగుడు దాడి చేసి బంగారు ఆభరణాలు లూటీ చేశాడు.కనిపించకుండా పోయిన కడప బాలాజీ నగర్ కి చెందిన పెద్దపల్లి మాధవి(55) గారి ఆచూకీ ఇంకా తెలియలేదు అన్నారు. కడప రాజారెడ్డి వీధి కి చెందిన కోమ్మనూరు స్వీటీ (16) అదఅశ్యమయ్యారు,ఆమె కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు విచారణ పురోగతి కనిపించదు అన్నారు.ఈ ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఏ మాత్రం రక్షణ కల్పించలేకపోతోందని స్పష్టంగా చూపిస్తున్నాయి అన్నారు. మహిళలపై దాడులు, హత్యలు, మిస్సింగ్ కేసులు పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది అని విమర్శించారు. రాష్ట్రంలో కఠినంగా నేరస్తులను శిక్షించకపోతే, మహిళలకు భద్రత ఎలా ఉంటుంది? మహిళా హౌం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళా పోలీసులకు దిక్కు లేకపోతే ఇంకా సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు.ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనలపై స్పందించి బాధ్యులను శిక్షించాలి, లేదంటే మహిళల రక్షణ కోసం ఆందోళన ముమ్మరం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.
మహిళలకు రక్షణ లేని కూటమి ప్రభుత్వం : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.డి. విజయ జ్యోతి
