అదాని అరెస్టు కోసం కాంగ్రెస్‌ ర్యాలీ

Dec 1,2024 01:31

ప్రజాశక్తి – పెదకూరపాడు : దేశాన్ని బిజెపి ప్రభుత్వం తాకట్టు పెడుతోందని జాతీయ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి మమతా నాగిరెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక షాదీఖానాలో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు గంటా గోపి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. మమత మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం రుణమాఫీలు చేస్తోందని, ఆదానీకి విమానాశ్రయాలు, రోడ్లు, రైల్వే ఆస్తులను ఇస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంటును ప్రైవేటీకరించొద్దన్నారు. సోలార్‌ పవర్‌లో అవకతవకల వ్యవహారంలో ఆదానినీ అరెస్టు చేయాలన్నారు. యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రామారావు మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ దాచారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగుల హామీని నెరవేర్చాలన్నారు. గంటా గోపి మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. తొలుత గ్రామ ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదానిని అరెస్టు, మోడీ విధానాలను వ్యతిరేకించే పోస్టులను ఆవిష్కరించారు. యూత్‌ కాంగ్రెస్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి టి.సందీప్‌, జిల్లా ఇన్‌ఛార్జి పి.ప్రసాదు, నియోజకవర్గ యూత్‌ అధ్యక్షులు ఉదయ శంకర్‌, భవాని వెంకటేష్‌, అద్బుల్‌ రహీం పాల్గొన్నారు.

➡️