టీటీడీలో ఆర్థిక అక్రమాలు, కుంభకోణాలపై కాంగ్రెస్‌ ధర్నా

తిరుపతి సిటీ : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి భక్తులు సమర్పించిన కానుకలను తమ ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి, తమ రాజకీయ ప్రాబల్యం పెంచుకోవడానికి, 2024 ఎన్నికల్లో విజయం సాధించడానికి టీటీడీ నిధులను దుర్వినియోగం చేసిన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట కాంగ్రెస్‌ పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. పార్టీ జెండాలు చేత పట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు టీటీడీలో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డవారని కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ … టిటిడిని తమ సొంత జాగీర్‌ గా భావించి గత ప్రభుత్వ పాలకులు, మాజీ చైర్మన్లు, పాలకమండలి సభ్యులు, వైసిపి నాయకులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనపై శ్రీవారి భక్తులు, తిరుపతి ప్రజలు, టిటిడి ఉద్యోగులు సైతం విసిగిపోయారని తెలిపారు. ప్రధానంగా తిరుమలలో 2019 కి ముందు ఉన్న హాకర లైసెన్సుల కన్నా వందల సంఖ్యలో అక్రమంగా తమ అనుచరులకు హాకరు లైసెన్సులు కేటాయించి ఉపాది కల్పించారని ఆరోపించారు. ఒక హౌకర్‌ లైసెన్స్‌ తో నాలుగైదు చోట్ల వ్యాపారాలు చేస్తూ టీటీడీని దగా చేశారని ఆయన మండిపడ్డారు. హాకర్‌ లైసెన్సులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని కొన్నిచోట్ల ఫుడ్‌ లైసెన్సులుగా మార్చుకునేందుకు కోట్ల రూపాయలు వసూలు చేసి సొమ్ము చేసుకున్నారని తెలుస్తోందన్నారు. దీనిపై టిటిడి విజిలెన్స్‌ విచారణ చేపట్టాలన్నారు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిలు భక్తులకు, పర్యావరణానికి ముప్పు పేరుతో ప్లాస్టిక్‌ బాటిల్స్‌ కు బదులుగా గ్లాసు బాటిళ్ళను తిరుమలకు తెప్పిస్తామని శ్రీవారి భక్తులను నమ్మించారన్నారు. తిరుచానూరుకి మూడు కిలోమీటర్ల దూరంలో తన బంధువుల చేత బాటిల్‌ తయారీ పరిశ్రమను పెట్టించిన భూమన కరుణాకర్‌ రెడ్డి వాటిలో శుద్ధి చేసిన నీరు నింపి 20 రూపాయలకు విక్రయించడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఈ బాటిల్‌ తయారీ పరిశ్రమకు అప్పటి టీటీడీ అధికారులు నిధులు సమకూర్చారని వస్తున్న ఆరోపణలపై ఈవో సమాధానం చెప్పాలని, వాస్తవాలను భక్తులకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా గత పాలకమండలి చైర్మన్‌ ల సహకారం, వైసీపీ నేతల అండదండలతో కాంట్రాక్టర్లు దొంగ గ్యారంటీ ఇచ్చి తమ అర్హతకు సంబంధించి దొంగ సర్టిఫికెట్లు పెట్టి టీటీడీలో కోట్ల రూపాయల పనులు చేశారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. తక్షణం టిటిడి ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంకు గ్యారంటీలు ఎక్స్పీరియన్స్‌ సర్టిఫికెట్లపై విజిలెన్స్‌ విచారణ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చి టీటీడీని మోసం చేసిన వారిపై అలాగే వారిని ప్రోత్సహించిన వారిపై, సంబంధిత అధికారుల పైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలల పైనే అవుతున్నా ఇప్పటివరకు టీటీడీలో జరిగిన అక్రమాలకు కారకులైన వారిని గుర్తించకపోవడం దారుణం అన్నారు. కూటమినేతల అలసత్వం, తీరు చూస్తే గత ప్రభుత్వ పాలకులతో కుమ్మక్కయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనిపై టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకొని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. పీసీసీ ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్‌ రెడ్డి మాట్లాడుతూ 2019 నుంచి వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమలలో భారీ అవినీతి, అక్రమాలు, ఆశ్రిత పక్షపాతం తో అనేక పనులు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. దీనికి వ్యతిరేకంగా ఆనాడు ఆందోళనలు చేసిన టిడిపి, జనసేన బిజెపి నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. తాము అధికారంలో కి వచ్చేసాం కాబట్టి ఇక ప్రశ్నించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారా లేకుంటే తమ వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. శ్రీవారి నిధులను పక్కదో పట్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం కూటమినేతలకు ఉందా లేదా అని ఆయన ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ మాంగాటి గోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారికి సమర్పించే ప్రసాదాలలో కల్తీ నెయ్యి వాడారని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినా ఇంతవరకు దోషులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని, కారకులు ఎవరో బయట పెట్టలేదని ప్రశ్నించారు. సిట్‌ దర్యాప్తు పేరుతో జరుగుతున్న విచారణ మరో నాలుగు గేండ్లు కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. తిరుమలలో భక్తుల సమర్పించిన తలనీలాలు ఆన్లైన్‌ టెండర్లలో సైతం అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయన్నారు. తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లను, వసతి గదులను సైతం అమ్ముకున్న గత వైసిపి ప్రతినిధుల బండారం బయటపెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని కూటమినేతలు సమర్థిస్తున్నారా లేక ఏమి జరగకపోయినా జరిగిందని అసత్య ప్రచారాలు చేశారా అని ఆయన నిలదీశారు. తప్పు చేసిన వారు తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదని ఆయన తెలిపారు. పిసిసి ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల నిర్మాణం పేరుతో శ్రీవాణి పథకం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారని ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని కూటమినేతలే ప్రకటించారన్నారు. ప్రస్తుత పాలకమండలి చైర్మన్‌ సైతం శ్రీవాణి నిధులు ఇకపై ఒకే అకౌంట్లో వేస్తామని చెప్పారన్నారు. అయితే గతంలో కార్పస్‌ ఫండ్‌ కింద కేటాయించిన నిధులు ఎంత ఖర్చు చేశారు, ఎన్ని దేవాలయాలు కట్టారు అనే అంశంపై టిటిడి శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిర్మించిన దేవాలయాలలో నాణ్యత లోపాలు ఉన్నాయని, భారీగా నిధులు దుర్వినియోగం అయినట్లు వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు చిత్తూరు శివశంకర్‌ మాట్లాడుతూ టిటిడిలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ లకు వారి సీనియార్టీ ప్రాతిపదికన రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పొరుగు సేవల నుంచి తీసుకువచ్చి టిటిడిలో పెట్టడం వల్ల రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు కావడం లేదని పదోన్నతులు లేకుండానే ఎస్సీ ఎస్టీలు పదవీ విరమణ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే టిటిడిలో తక్షణం ఖాళీ పోస్టుల భర్తీకి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, నూతన పాలకమండలి చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్నా అనంతరం టిటిడిఈఓ శ్యామల రావు ని కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ బీసీ సెల్‌ కోఆర్డినేటర్‌ కంభంపాటి మురళీకఅష్ణ, పిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, పిసిసి ఎస్సి విభాగం కోఆర్డినేటర్‌ భోయన నరేంద్రబాబు, ఎన్‌ ఎస్‌ యు ఐ రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున, తిరుపతి కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి తలారి గోపి, ఉపాధ్యక్షుడు మోహన్‌, నాయకులు వై.సుబ్రహ్మణ్యం, వెంకట్రామయ్య, మహిళా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గన్నారు.

➡️