ఫిబ్రవరి 5న జరిగే నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయండి : జొన్న శివశంకరరావు

Feb 4,2025 16:32 #guntur, #Tadepalli

ప్రజాశక్తి – తాడేపల్లి రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వం తెచ్చిన  నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ సిపిఐ(ఎం) పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది.  ఫిబ్రవరి 5వ తేదీ మండల, గ్రామాలలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు రైతు సంఘం తాడేపల్లి మండల అధ్యక్షులు మోదుగుల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని మేక అమరా రెడ్డి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  జొన్న శివశంకరరావు మాట్లాడుతూ దేశంలో నూటికి 70 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని వీరికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కేవలం 2.5 1 శాతం, ఒక లక్ష 71 437 కోట్లు మాత్రమే ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకుందని అన్నారు. ఎరువుల సబ్సిడీలో రూ. 3412 కోట్లు కోత విధించారని, వ్యవసాయ కూలీలు, కౌలు రైతుల గురించి ప్రస్తావనే లేదని అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, కనీస మద్దతు ధరలకు సంబంధించి బడ్జెట్లో వాటి జాడేలేదని ఆయన విమర్శించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 20- 21 బడ్జెట్లో 1,110170.86 కోట్లు కేటాయిస్తే, 2025-2026లో 86 వేల కోట్ల మాత్రమే కేటాయించడం దారుణం అన్నారు. విద్యా, వైద్య రంగానికి కూడా నిధులు కేటాయించటం బిజెపి పరిపాలనకు నిదర్శనం గా మారిందని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ బడ్జెట్ రూ. 5396 కోట్లు కేటాయిస్తే, నిర్వాసితుల పరిహారం, పునరావాసం గురించి ప్రస్తావనే లేదని మండిపడ్డారు. బీమా రంగంలో 100శాతం ఎఫ్డిఐ లను అనుమతించడం ఘోరం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా అన్ని మండల, గ్రామల లో నిరసన కార్యక్రమాలు పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. సిఐటియు తాడేపల్లి పట్టణ నాయకులు బూరుగ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వెంకటేశ్వరరావు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర ప్రజలను నిరాశకు గురి చేసిందని అన్నారు. విభజన హామీలను పక్కనపెట్టి ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించటం అన్యాయం అన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కడప స్టీల్ ప్లాంట్, దుగరాజుపట్నం పోర్టు కు నిధులు కేటాయించకపోవడం అన్యాయం అన్నారు. కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ మాట్లాడుతూ వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రాజధాని నిర్మాణానికి నిధుల ప్రస్తావన లేదని అన్నారు. ఈ సమావేశంలో రాజధాని రైతు సంఘం అధ్యక్షులు కొర్రపోలు ఈశ్వరరెడ్డి, టీ బక్కిరెడ్డి, తాడే కోరు కొండయ్య, హనుమంతరావు, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

➡️