నగరంపాలెం ఎస్‌బిఐ వద్ద నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
ప్రజాశక్తి-గుంటూరు : యునైటెడ్ ఫోరమ్ అఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు ఈనెల 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక నగరంపాలెంలోని ఎస్‌బిఐ కార్యాలయం ఎదుట, జెకెసి కాలేజి రోడ్డులోని ఇండియన్ బ్యాంక్ జోనల్ ఆఫీసు వద్ద ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంకు ఉద్యోగులు మంగళవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎస్‌బిఐ వద్ద జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పిల్లి కిషోర్, బాబా సయ్యద్ బాషా, మురళీకృష్ణ, సునీత, రంగసాయి, రాంబాబు, సాంబశివరావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీలు భర్తీ చేయాలని, ఐదు రోజుల పనివిధానం అమలు చేయాలని, తాత్కాలిక సబ్‌స్టాఫ్‌ను పర్మినెంట్ చేయాలని, ఇతర పెండింగ్ సమస్యలపై జరిగే సమ్మెలో ప్రతి బ్యాంకు ఉద్యోగి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా బ్యాంకుల సమ్మెకు సహకరించాలని కోరారు. ఇండియన్ బ్యాంక్ జోనల్ ఆఫీసు వద్ద ఇండియన్ బ్యాంక్ వద్ద నిరసనలో ఏపీటీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోమటి రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న దాదాపుగా రెండు లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కోరారు. ఐబోక్ ప్రెసిడెంట్ మూర్తి మాట్లాడుతూ ఎన్‌పిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మహిళా విభాగ కన్వీనర్లు సౌమ్య, మంజీరా, హరిత, సౌమ్య దీప్తి పాల్గొన్నారు.
