యువత పోరును జయప్రదం చేయండి : వైసీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి

ప్రజాశక్తి – వేంపల్లె (కడప) : వైసీపీ కాంగ్రెస్‌ పార్టీ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌ వద్ద నిర్వహించనున్న యువత పోరు కార్యక్రమాన్ని వైసీపీ కార్యకర్తలు జయప్రదం చేయాలని వైసీపీ మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి యువత పోరుకు సంబంధించిన పోస్టర్లను మండల కన్వీనర్‌ చంద్ర ఓబుల్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను ఆయన గాలికి వదిలేసారని విమర్శించారు. నిరుద్యోగ భఅతి రూ 3వేలు ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఈ పథకాన్ని అమలు చేయ లేదన్నారు. అలాగే ప్రతి లబ్ధిదారునికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి ఏదో ఆరకొరగా ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. చాలామంది లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాలేదన్నారు. అలాగే తల్లికి వందనం గత విద్యా సంవత్సరంలో అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి రూ 12 వేల కోట్లు బడ్జెట్‌ అవసరం కాగా కేవలం రూ 9 వేల కోట్లు మాత్రమే పింఛన్ల కంపెనీకి సంబంధించి బడ్జెట్లో రూ 5వేల కోట్లు తగ్గి పోయిందన్నారు. అదేవిధంగా ఉచిత బస్సు పథకం అమలు ఇంతవరకు అమలు కాలేదని పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి వేతనాలు సక్రమంగా అందడం లేదని, వారికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే పరిస్థితి లేదన్నారు. ఐఆర్‌ డి ఎ, బకాయిల సంబంధించి ఊసే లేదన్నారు. నాడు – నేడు మనబడి పథకాన్ని ఎత్తేసారని, ఫీజు రియంబర్స్‌ మెంట్‌ అమలు నోచుకోలేదని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని తెలిపారు. రైతుల సంక్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కావున యువత పోరులో విద్యార్థులు నిరుద్యోగులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల ఉపాధ్యక్షుడు మునీర్‌, రవిశంకర్‌ గౌడ్‌, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కటిక చంద్రశేఖర్‌, కార్మిక విభాగం అధ్యక్షులు బాలాజీ, వైసీపీ నాయకులు ఎం హెచ్‌ హబివుల్లా, మునేష్‌, సురేంద్ర, బికారి, సునీల్‌ కుమార్‌, కమతం రాజా, పోలేపల్లి గణేష్‌ పాల్గొన్నారు.

➡️