- వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు
- వాల్ పోస్టర్ ఆవిష్కరణ పత్రిక ఆవిష్కరణ
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు, మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న కలెక్టరేట్ వద్ద చేపట్టిన ‘యువత పోరు’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు కోరారు. విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4400 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు నెలకు 3 వేలు రూపాయిలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి విస్మరించారన్నారు. దీంతో పాటు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే దానిని ప్రైవేటుపరం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఆలోచించడం అన్యాయమన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందకుండా చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వెంటనే మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 12 తేదిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అన్ని నియోజకవర్గాల్లో ఉదయం జరపాలని.. కలెక్టరేట్ వద్ద జరిగే యువత పోరు కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ.. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో పార్టీ నాయకులు సూర్యనారాయణ, రాజు, నెక్కలనాయుడుబాబు, జైహింద్ కుమార్, బంగారు నాయుడు, నరసింహమూర్తి, యువజన, విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు.