ప్రజాశక్తి-పర్చూరు : సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల కోసం ఏర్పాటు చేసిన వెంకటేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను రానున్న రోజుల్లో వినియోగంలోకి తీసుకురానున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు. పర్చూరులో వెంకటేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, బోడవాడలోని నివేదిత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను టిడిపి నాయకులు, విశ్రాంత ఇంజినీరు సత్యనారాయణ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎనిమిది వందల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో పర్చూరులో వెంకటేశ్వర లిఫ్ట్‌ఇరిగేషన్ స్కీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 400 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే లక్ష్యంతో బోడవాడలో నివేదిత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంకటేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మరమ్మతులకు నోచక చాలా కాలంగా వినియోగంలో లేకపోవడంతో చిల్ల చెట్లతో నిండిపోయినట్లు తెలిపారు. లక్షలాది రూపాయల విలువైన విద్యుత్ మోటార్లు చోరీ గురైనట్లు తెలిపారు. నియోజకవర్గంలో వినియోగంలో లేని లిఫ్ట్ ఇరిగేషన్ల మరమ్మతులకు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. అందులో భాగంగా విశ్రాంత ఇంజనీర్ ఎంవై.సత్యనారాయణ ఆధ్వర్యంలో స్కీములను పరిశీలించి అంచనాలు రూపొందించి నివేదికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ షంషుద్దిన్, ఆకుల శ్రీనివాసరావు, కొల్లా బుల్లిబాబు, గడ్డిపాటి శ్రీనివాసరావు, రైతులు తులసి శంకర్, వెలగా శ్రీనివాసరావు, కోట మధు, తులసి సాంబయ్య, ఆచంట సుబ్బారావు, శిరిగిరి నాగేశ్వరావు, శంగవరపు కోటేశ్వరరావు, మహేష్, నాని తదితరులు పాల్గొన్నారు.
