వక్ఫ్‌ భూములను కొల్లగొట్టేందుకు కుట్ర

Apr 16,2025 21:13

  సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి

ముస్లిము సంఘాల డిమాండ్‌

మద్దతు తెలిపిన సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, పలు ప్రజా సంఘాలు

నగరంలో భారీ ర్యాలీ, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా, రాస్తారోకో

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ : వక్ఫ్‌ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరంలో ముస్లిములు బుధవారం పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఉర్దూ పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ మూడులాంతర్లు మీదుగా ఎమ్‌జి రోడ్డు, గంటస్తంభం, కన్యకా పరమేశ్వరి జంక్షన్‌, సిఎంఆర్‌ జంక్షన్‌, బాలాజీ మార్కెట్‌ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకుంది. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ముస్లిము మైనారిటీ నాయకులు మహమ్మద్‌ నిజాం, షకీర్‌ షేక్‌, అక్బర్‌ షరీఫ్‌, ఎమ్‌డి ఇక్బాల్‌, షేక్‌ ముస్తాదీన్‌, మున్వర్‌ బారు, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు, సిపి ఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌, డిబిఎస్‌యు నాయకులు పి.చిట్టిబాబు, బిఎస్‌పి నాయకులు పి.వెంకటరమణ మాట్లాడారు. ఎన్నికల ముందు సబ్కా వికాస్‌ సబ్కా సాత్‌’ అని చెప్పిన బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముస్లిము మైనారిటీలపై దాడులు చేస్తోందన్నారు. ఇందుకు ఎన్‌ఆర్‌సి, యుసిసి, ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌ రద్దు వంటివే ఉదాహరణ అని చెప్పారు. బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న వక్స్‌ బోర్డును రద్దు చేసి ముస్లిముల మనోభావాలను దెబ్బతీసిందని, వక్స్‌ ఆస్తులు ప్రభుత్వానికో లేదా ఏ సంస్థకో చెందినవి కావని, ముస్లిముల అభివృద్ధి కోసం పూర్వీకులు దానధర్మాలు చేసి ఇచ్చిన ఆస్తులని స్పష్టం చేశారు. ఈ ఆస్తులపై బిజెపి ప్రభుత్వం కన్నేసిందని, సవరణ పేరుతో వాటిని దోచుకోవాలని కుట్ర పన్నుతోందని తెలిపారు. ఈ చట్టానికి మద్దతు తెలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ముస్లిములకు రక్షణగా ఉంటామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు వెన్నుపోటు పొడవడం బాధాకరమని అన్నారు. స్వాతంత్య్య్రం కోసం ఎంతోమంది ముస్లిము పండితులు, ఉలమాలు, మేధావులు ప్రాణాలర్పించారని, ఆ చరిత్రను బిజెపి ఒకసారి చదువుకోవాలని సూచించారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి వక్స్‌ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు వినతి అందజేశారు. అధిక సంఖ్యలో ముస్లిములు పాల్గొన్నారు.

➡️