ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాజ్యాంగ దినోత్సవాన్ని అర్థవంతంగా నిర్వహించాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పలువురు వక్తలు అన్నారు. కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాకోటి రాములు అధ్యక్షతన జెడ్‌పి ఆవరణలోని యుటిఎఫ్ కార్యాలయంలో బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి.శ్రీనివాస్, ఆమ్‌ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు పి.రమేష్‌రాజు, భారత్ బచావో జిల్లా అధ్యక్షులు కరీం, బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల సంఘం నాయకులు బి.వెంకటరావు, జానపద కళాకారు సంఘం జిల్లా కన్వీనర్ షణ్ముఖ రావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్ మాట్లాడారు. పాలక ప్రభుత్వాలు ప్రధానంగా బిజెపి ప్రభుత్వం కావాలనే రాజ్యాంగాన్ని, రాజ్యాంగ లక్ష్యాలకు, దాని స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని అన్నారు. అందులో భాగంగానే రాజ్యాంగ దినోత్సవాన్ని అందరికీ తెలిసేటట్లు చేయకుండా తూతూ మంత్రంగా జరిపి చేతులు దులుపుకుంటోందన్నారు. విభిన్న వైరుధ్యాలతో కూడిన భారతదేశాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకు నడిపించాలంటే రాజ్యాంగంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మనువాద శక్తుల చేతుల్లో రాజ్యాంగం నశించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిపై ఉందని అన్నారు. అనంతరం సమావేశం తీర్మానాన్ని ఆమోదించింది. అనంతరం కవిపిఎస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ రాజ్యాంగాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది.