కొనసాగిన ఉక్కు సత్యాగ్రహ దీక్షలు

Oct 3,2024 00:07

నరసరావుపేట దీక్షలో మాట్లాడుతున్న సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరుకుమార్‌
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా :
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల కేటాయించి, సెయిల్‌లో విలీనం చేయాలని, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాల పిలుపు మేరకు గుంటూరు, పల్నాడు జిల్లా కేంద్రాల్లో చేపట్టిన సత్యాగ్రహ దీక్షలు బుధవారమూ కొనసాగాయి. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని గాంధీపార్కు వద్ద ధర్నాచౌక్‌లో సిఐటియు, ఎఐటియుసి, ఇతర సంఘాల ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలను సిఐటియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్‌, ఎఐటియుసి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వి రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. తొలతు మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజరుకుమార్‌ మాట్లాడుతూ లాభాల బాటలో, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలను ఏకతాటిపైకి తెస్తామన్నారు. రాష్ట్ర విభజన హామీలను విస్మరించిన కేంద్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు, టిడిపి, జనసేన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిద్ర నటిస్తోందని, సిఎం, డిప్యూటీ సిఎంకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎంపీల ఆధారంగా మనుగడ సాగిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అధికార ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిలబెట్టాల్సింది పోయి నరేంద్ర మోడీ అడుగులకు మడుగులోత్తడం దారుణమన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు.గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎ.అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన సత్యాగ్రహ దీక్షలను ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజరుకుమార్‌, డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ ప్రారంభించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు, ఎఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు జంగాల అజరుకుమార్‌, ఎఐయఫ్టియూ (న్యూ) జిల్లా నాయకులు కె.కోటయ్య మాట్లాడారు. విశాఖఉక్కు పరిశ్రమను కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయబోమని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలకు ముందు విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు తమను అధికారంలోకి తీసుకురావాలని కోరి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వేగవంతం చేస్తున్నాయన్నారు. 4200 మంది కాంట్రాక్ట్‌ కార్మికులకు గేట్‌ పాసులు ఇవ్వకుండా పని లేదని చెప్పటం, రెండు పర్న్‌ బ్లాస్ట్‌లు పూర్తిగా మూసివేసి ఉత్పత్తిని తగ్గించటం వంటి చర్యల ద్వారా విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలు బాట పడుతుందని ప్రచారం చేయడంతో పాటు, ప్రైవేటీకరణ చేసేందుకు పూల బాటలు వేస్తున్నారని విమర్శించారు. దేశంలో విశాఖ ఉక్కుకు తప్ప అన్ని ఉక్కు పరిశ్రమలకూ సొంత గనులు ఉన్నాయని, విశాఖకు మాత్రం ఎందుకు సొంతగనులు కేటాయించట్లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థ పట్ల చిన్నచూపు తగదన్నారు. ఒకవైపు బడ్జెట్‌లో రాష్ట్రానికి సరిగా నిధులు ఇవ్వక, మరోవైపు ప్రతిష్టాత్మక విశాఖ ఉక్కును తెగనమ్మటం సరికాదన్నారు. కానీ బీహార్‌కు మాత్రం రూ.59 వేల కోట్ల కేటాయించిందన్నారు. కావున విశాఖ ఉక్కును కాపాడతారని పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో టిడిపి భారీ మెజారీటి వచ్చిందని, ఇప్పటికైనా టిడిపి పునరాలోచిం చుకొని ఉక్కు రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో దీక్షలకు యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్‌, విజయసారథి నాయకులు మోహనరావు, సుందరరావు, ఎల్‌ఐసి ఏజెంట్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఈవూరి మస్తాన్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎ.మారుతి వరప్రసాద్‌, హుస్సేన్‌ సంఘీభావం తెలిపారు. దీక్షల్లో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు నాయక్‌, సిలార్‌ మసూద్‌, టి.శ్రీనివాసరావు, పి.వెంకటేశ్వర్లు, వి.విజయలక్ష్మి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాంబాబు, అధ్యక్షుడు కె.వెంకటరావు, బి.శీనివాసరావు కూర్చున్నారు. డి.శివకుమారి, జి.మల్లేశ్వరి, షేక్‌ మస్తాన్‌వలి, నిర్మల, సాయికుమారి, యు.రంగయ్య, జకరయ్య, చిన్నసైదా పాల్గొన్నారు. గుంటూరు దీక్షల్లో కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, కార్యదర్శి బి.ముత్యాలరావు, మెడికల్‌ రిప్రజెంటివ్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు మహమ్మద్‌ అబ్దుల్‌ సలీం, సిహెచ్‌ కుమార్‌, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌కె బాష, పంచాయతీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి సిహెచ్‌.శ్రీనివాసరావు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎస్‌కె ఖాసింవలి, ఆటో యూనియన్‌ నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఏపీ ఎన్‌జిఒ నాయకులు మూర్తి, ఎఐటియుసి నాయకులు ఆర్‌.అంజిబాబు, బి.రవికుమార్‌ పాల్గొన్నారు.

గుంటూరు దీక్షలో మాట్లాడుతున్న సిఐటియు జిల్లా కార్యదర్శి బి.లక్ష్మణరావు

➡️