ప్రజాశక్తి-ఎర్రగుంట్ల ఆర్‌టిపిపి నుంచి బూడిదను తాడిపత్రికి తరలించే విషయంలో జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్‌రెడ్డి గ్రూపుల మధ్య వివాదం కొనసాగుతోంది. రెండు రోజులుగా ఆర్‌టిపిపి, కొండాపురం సరిహద్దు ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రెండు గ్రూపుల మధ్య వివాదానికి సంబంధించి చర్చలు జరుగుతున్నా ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాడిపత్రి నుంచి జెసి అనుచరులు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి. అనంతపురం, కడప జిల్లా సరిహద్దు ప్రాంతమైన కొండాపురం మండలంలో చెక్ ఫోస్ట్ ఏర్పాటు చేశారు. కాగా జెసి ప్రభాకర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి ఇద్దరూ కూటమి నేతలే కావడం విశేషం. జెసి దివాకర్‌రెడ్డి తాడిపత్రికి చెందిన టిడిపి నాయకుడు, ఆదినారాయణరెడ్డి బిజెపి ఎమ్మెల్యే వీళ్లిద్దరి మధ్య ప్లైయాష్ తరలింపునకు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోకి ఆర్‌టిపిపి వస్తుంది. తమ నియోజకవర్గంలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలని ఆదినారాయణరెడ్డి భావిస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని సిమెంట్ పరిశ్రమలకు ఆర్‌టిపిపి నుంచి జెసి అనుచరుల వాహనాలు ప్లైయాష్ తరలిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుదరకపోవడంతో జెసి వాహనాల్ని ఆర్‌టిపిపికి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకూడదని ఆదినారాయణరెడ్డి అనుచరులు పంతం పట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జెసి వాహనాలు ఆర్‌టిపిపికి వస్తున్నాయని తెలిసి, ఆర్‌టిపిపి సమీపంలోని కలమల్ల వద్ద ఆదినారాయణరెడ్డి అనుచరులు భారీగా మోహరించారు. వస్తే అడ్డుకోడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ బందోబస్తు ఏర్పాటు చేశారు. బూడిద తమ దగ్గర ఉంది కాబట్టి తమ వాహనాలతో తరలిస్తామని ఆదినారాయణరెడ్డి అనుచరులు అంటున్నారు. కానీ తరలించేది తాడిపత్రికి కాబట్టి తమ వాహనాల్లోనే తీసుకువస్తామని జెసి ప్రభాకర్‌రెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో రెండు గ్రూపుల మధ్య పంచాయతీ పెరిగిపోయింది. జెసి వాహనాలు వస్తే అడ్డుకుని తీరుమామని ఆదినారాయణరెడ్డి వర్గీయులు అంటున్నారు. కాగా ఆర్‌టిపిపిలో బుధవారం 144సెక్షన్ అమలుకు తహశీల్దారు శోభన్ బాబు ఉత్తరవులు జారీ చేసారు. ఉన్నతాధికారుల అదేశాల మెరకు అల్లర్లు జరగకుండా ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.