కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలి : సిఐటియు ధర్నా

విజయవాడ (ఎన్టీఆర్‌ జిల్లా) : వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లోని పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి నాగేశ్వరావు డిమాండ్‌ చేశారు. కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సమానపనికి సమానవేతనం, కార్మికచట్టాల అమలు, రెగ్యులర్‌ చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్‌ లో సోమవారం ఉదయం సిఐటియు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏ.వి నాగేశ్వరరావు మాట్లాడుతూ … పరిశ్రమల్లోని కాంట్రాక్ట్‌ కార్మికులు కనీసవేతనాలు, పనిగంటలు, సెలవులు వంటి ఎలాంటి సంక్షేమ సౌకర్యాలు అమలుకు నోచుకోకుండా యంత్రాల్లా పనిచేస్తున్నారనీ పి.ఎఫ్‌.. ఇ.ఎస్‌.ఐ. గ్రాట్యుటీ లాంటి చట్ట సౌకర్యాలు చాలా మందికి అమలుకావటం లేదుని వేళకు తిండి కూడా వుండదు. కానీ కాంట్రాక్టర్లు మాత్రం వీరిని దోపిడీ చేస్తూ అత్యధిక లాభాలు గడిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో విద్యుత్‌, ఆర్టీసితో సహా ఔట్సోర్సింగ్‌ పేరుతో లక్షలాది మంది పనిచేస్తున్నారునీ. ఈ రంగాలన్నింటిలో పర్మినెంట్‌ చేయడం ప్రభుత్వాల, యాజమాన్యాలదే బాధ్యత. కాని కార్మికులను కట్టుబానిసల్లాగా పనిచేయిస్తున్నారనీ, పనిభద్రత లేకుండా వున్న చట్టాలను అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలకు తొత్తులుగా మారాయి. కార్మికశాఖను యాజమాన్య డిపార్ట్మెంట్‌ గా మార్చేశారనీ అన్నారు. గత 10 సం ల నుంచి కేంద్ర ప్రభుత్వం పచ్చి కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నదినీ పరిశ్రమల్లో తనిఖీలు పూర్తిగా లేకుండా చేసింది. తనిఖీలు లోపించడంతో తరచూ ప్రమాదాలు జరిగి కార్మికుల ప్రాణాలు ఆవిరైపోతున్నాయి. డ్యూటీకి వెళ్ళిన వారు తిరిగి వస్తారనే గ్యారంటీ లేకుండా పోయింది. కాంట్రాక్ట్‌ లేబర్‌, క్యాజువల్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌, గెస్ట్‌, ఔట్సోర్సింగ్‌, గౌరవ వేతనం, అగ్రిమెంట్‌ కార్మికులు, పీస్రోట్‌, ఫిక్స్డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్మెంట్‌ తదితర పేర్లు పెట్టి పనిచేయిస్తున్నారు. పర్మినెంట్‌ కార్మికులతో పోలిస్తే అదే పనిలో ప్రక్క ప్రక్కనే పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులకు 4, 5 రెట్లు జీతాలు తక్కువ ఇస్తున్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ సిఫార్స్‌ నెం. 204 ప్రకారం ఫిక్స్డ్‌ టెర్మ్‌ ఎంప్లాయ్మెంట్‌ పద్ధతిని రద్దుచేయాలి. కానీ ఎక్కడా అమలు కావడం లేదుని అన్నారు. సిమెంట్‌ పరిశ్రమలలో కార్మికులు దుమ్ము, ధూళిలో రాత్రింబవళ్ళు పనిచేస్తుంటారు. ఫార్మా కంపెనీల్లో విషవాయువుల్లో, ఘాటైన వాసనలో, అత్యంత చలి వాతావరణంలో పనిచేస్తున్నారు. అన్ని చోట్ల కార్మికుల జీతాలు నెలకు రూ.15 వేలు కంటే తక్కువే ఉన్నాయి. శాశ్వత స్వభావం కలిగిన పనులన్నింటిలోనూ పర్మినెంట్‌ కార్మికులే ఉండాలని చట్టం చెపుతున్నది. అసలు పర్మినెంట్‌ ఉద్యోగులే ఉండరాదనే సిద్ధాంతాన్ని కేంద్ర పాలకులు అమలు చేస్తున్నారు. ఆర్మీ, రక్షణ, రైల్వే, విద్యుత్‌ వంటి కీలక రంగాలతో సహా అన్నింటిలో కార్మికులను తాత్కాలిక పేర్లతోనే పని చేయిస్తున్నారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి ప్రభుత్వాలు రెండూ కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేశాయి. ఔట్సోర్సింగ్‌, ఆప్కాస్‌ ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు 2008 నుండి అమలైన మినిమం టైంస్కేల్కు తిలోదకాలు ఇస్తూ గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం జిఓ 151 విడుదల చేసింది. వైసిపి ప్రభుత్వం కూడా ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు రూ.5 వేలు నుండి రూ.13. వేలకు మినిమం టైమ్‌ స్కేల్‌ కన్నా తగ్గించి జీఓ 7 ను విడుదల చేసింది.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థలు, టిడిడి వంటి ధార్మిక సంస్థలలోని నాన్‌ పర్మినెంట్‌ ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చెయ్యాలని, పర్మినెంట్‌ చెయ్యాలని ఈ క్రింది డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు.

డిమాండ్స్‌ :
1. ఫ్యాక్టరీలు, ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో శాశ్వత స్వభావం కలిగిన విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌, క్యాజువల్‌, డైలీవేజ్‌, కంటింజెంట్‌, అవుట్సోర్సింగ్‌, పీస్‌ రేట్‌ తదితర కార్మికులు, ఉద్యోగులందరినీ పర్మినెంట్‌ చేయాలి.
2. కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలి.
3. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
4. కాంట్రాక్టర్‌ మారినా కార్మికులను కొనసాగించాలి.
5. పి.ఎఫ్‌, ఇ.ఎస్‌.ఐ, బోనస్‌, సెలవులు, గ్రాట్యూటీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వంటి హక్కులన్నీ తప్పక అమలు చేయాలి.అమలు చేయని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
6. ఆప్కాస్‌ మరియు వివిధ ప్రభుత్వ శాఖలు, పధకాలు, సంస్థల్లోని కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చేయాలి.
7. అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
8. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి.రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, ఆరోగ్యబీమా అమలు చేయాలి. కారుణ్య నియామకాలు ఇవ్వాలి.
9. ప్రతి నెల మొదటి వారంలో జీతాలు ఇవ్వాలి. వేతన బకాయిలు వెంటనే చెల్లించాలి.
10. జెన్కో, ట్రాన్స్కోల్లోని కాంట్రాక్ట్‌, ఔట్సోర్సింగ్‌ కార్మికులందరినీ సంస్థలో రెగ్యులర్‌ య్యాలి.ఈ లోగా డైరెక్ట్‌ పేమెంట్‌ ఇవ్వాలి.
11. పీస్‌ రేటు విధానం రద్దుచేయాలి.
12. కార్మిక శాఖ నిర్ణయించిన విధంగా ప్రతి 6 నెలలకు పెరిగిన వి.డి.ఎ ను అమలు చెయ్యాలి.
13. విద్యుత్‌ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. రోష్టర్‌ పద్దతి అవలంభించాలి.

ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కోశాధికారి కె ఆర్కే మూర్తి, రాష్ట్ర కార్యదర్శి కే.ఉమామహేశ్వరావు, ఆర్‌.వి నరసింహారావు, రాష్ట్ర నాయకులు ఇ.వి.ఎల్‌ నరసింహులు, ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షులు ఏ.వెంకటేశ్వరరావు , జిల్లా కార్యదర్శిలు ఏ.కమల, ఎం.మహేష్‌, సి.హెచ్‌ సుధాకర్‌, ఇ.వి. నారాయణ, కే.దుర్గారావు, నాయకులు ఏం.సోమేశ్వరరావు, ఏం.బాబురావు, ఎల్‌.రాజు, ఇ.వి రాజు, సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️