రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
ప్రజాశక్తి – పార్వతీపురం : టిడిపి కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, అదానీ గ్రూపు, సెకితో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎన్జీవో హోంలో వామపక్షాల ఆధ్వర్యాన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకులు మాట్లాడారు. స్థానిక ఎన్జీవో హోంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో వామపక్ష నాయకులు మాట్లాడారు. ఈ సమావేశంలో సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు పి.రమణి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి టి.జీవ, సిపిఎం పట్టణ కార్యదర్శి జి.వెంకటరమణ, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా నాయకులు పి.రంజిత్ కుమార్, అఖిల భారత గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం (లిబరేషన్) నాయకులు పి సంగం, అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు బి.నరసింగరావు తదితర సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ట్రూ ఆఫ్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ప్రవేశపెడితే, విద్యుత్ భారాలు వేస్తే టిడిపి వాటిని రద్దు చేస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాలు అమలు చేయడం రాష్ట్ర ప్రజలను మోసగించడమేనని అన్నారు. అదానీతో కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేయాలన్న తీర్మానాన్ని రెడ్డి వేణు ప్రవేశపెట్టారు. అన్ని మండలాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు జరపాలని, డిసెంబర్ 2న కలెక్టర్‌కు వినతి పత్రం ఇవ్వాలని పాల్గొన్న నాయకులు, సభ్యులు చర్చించి ఆమోదించారు. రూ.17వేల కోట్ల ట్రూ అప్ ఛార్జీల భారాన్ని రద్దు చేసి ఆ భారాన్ని ప్రభుత్వమే భరించాలని కోరారు. ట్రూ ఆఫ్ విధానాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు. టిడిపి కూటమి ఎన్నికల వాగ్దానం ప్రకారం విద్యుత్ చార్జీలు తగ్గించాలని, కేంద్ర విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు. నివాసాలకు, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పెట్టిన మీటర్లు తొలగించాలని, బలవంతంగా పెడితే అడ్డుకోవాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, వత్తిదారులందరికీ 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సెకితో కుదుర్చుకున్న ఒప్పందం, రాష్ట్రాన్ని దివాళా తీయించే అన్ని ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక నేరానికి పాల్పడిన అదానీ అప్పటి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలన్న తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో సిఐటియు నాయకులు బంకురు సూరిబాబు, బి వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు సూరయ్య, పట్టణ పౌరుష సంక్షేమ సంఘం నాయకులు పాకల సన్యాసిరావు, సంచాన ఉమా, డివైఎఫ్‌ఐ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పి రాజశేఖర్, సింహాచలం, అఖిలు తదితరులు పాల్గొన్నారు.