ఎన్‌సిసి, ఆర్‌ఎస్‌బిలతో గీతం అవగాహన ఒప్పందం
ప్రజాశక్తి -మధురవాడ : దేశ రక్షణ దళాలలో ప్రస్తుతం పనిచేస్తున్న, ఉద్యోగ విరమణ పొందిన సిబ్బందికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ కోర్సులలో ప్రత్యేక శిక్షణ అందించడానికి ఆంధ్ర, తెలంగాణ ఎన్‌సిసి డైరెక్టరేట్, పశ్చిమబెంగాల్‌కు చెందిన రాజ్య సైనిక్ బోర్డు (ఆర్‌ఎస్‌బి)లతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మంగళవారం గీతం ఇన్‌ఛార్జి వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజా ఫణి పప్పు సమక్షంలో గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్, ఎన్‌సిసి డిప్యూటీ డైరక్టర్ జనరల్ కల్నల్ సమీర్ శర్మ, పశ్చిమబెంగాల్ రాజ్య సైనిక్ బోర్డు కార్యదర్శి కల్నల్ పార్ధ ప్రతిమ్ బారిక్ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా గీతంవర్సిటీ ఇన్‌ఛార్జి విసి ప్రొఫెసర్ వై.గౌతమ్‌రావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యుజిసి, ఎఐసిటిఇ అనుమతులతో వివిధ మేనేజ్‌మెంట్ కోర్సులను గీతంలో నిర్వహిస్తున్నామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులకు శిక్షణ ఇవ్వడానికి ఏటా సిలబస్‌లో కొత్త అంశాలను చేర్చుతున్నామని వెల్లడిరచారు. ఎన్‌సిసి డిప్యూటీ డైరక్టర్ జనరల్ కల్నల్ సమీర్‌శర్మ మాట్లాడుతూ రక్షణ దళాలలో పనిచేస్తున్న వారు 30 నుంచి 40ఏళ్ల వయస్సులో ఉద్యోగవిరమణ చేస్తారని, తరువాత వేరే ఉద్యోగాలు పొందేందుకు వీలుగా వీరికి సరైన నైపుణ్యశిక్షణ అవసరమైన నేపథ్యంలో గీతం వర్సిటీ సహకారాన్ని కోరుతున్నామని తెలిపారు. పశ్చిమబెంగాల్ ఆర్‌ఎస్‌బి కార్యదర్శి కల్నల్ పార్ధ ప్రతిమ్ బారిక్ మాట్లాడుతూ రక్షణ దళాలలోని వివిధ విభాగాలలో పనిచేసిన వారికి ఆర్ధిక అంశాలపైన, అకౌంటింగ్, హెచ్‌ఆర్‌ఎమ్, హస్పిటల్ మెనేజ్‌మెంట్ అంశాలపై అవగాహన ఉంటుందని, వారికి ఎంబిఎ, బిబిఎ కోర్సుల్లో గీతంలో శిక్షణనివ్వాలని కోరారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ రాజాఫణిప్పు మాట్లాడుతూ రక్షణ దళాల సిబ్బందికి, విశ్రాంతి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై ప్రత్యేకదృష్టి పెట్టామని, దీనికోసం అంతర్గత కమిటీని నియమించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గీతం అకడమిక్ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ రాధిక, ఐక్యుఎస్ డైరక్టర్ ప్రొఫెసర్ రాజాప్రభు, గీతం మానవ వనరుల విభాగం అధిపతి (విఎస్‌ఎమ్) జి.వి.సత్యంనారాయణ పాల్గొన్నారు.
ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న సంస్థల ప్రతినిధులు