ఓటింగ్‌ అయిపోయినా నోటు కోసం వివాదాలు

May 16,2024 23:47

కౌన్సిలర్‌ భర్తను కూర్చోబెట్టిన ఓ ప్రాంతవాసులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
ఎన్నికల సందర్భంగా ఓట్ల కోసం పంచిన డబ్బు తమకు అందలేదని పట్టణంలోని కొన్ని ప్రాంతాల వారు స్థానిక ప్రధాన పార్టీ నాయకులను నిలదీశారు. డబ్బు పంపకంలో వివక్ష చూపారంటూ గొడవ పెట్టుకున్నారు. కొంతమందైతే ఒక ప్రముఖ పార్టీ ప్రధాన నాయకులను వారి కార్యాలయానికే వెళ్లే నిలదీయడం చర్చనీయాంశమైంది. ఒక వార్డులో అయితే కౌన్సిలర్‌ భర్తనే కదలకుండా కూర్చోబెట్టారు. తమకు పంచాల్సిన డబ్బులిచ్చేదాక వెళ్లనివ్వబోమని అడ్డుకున్నారు. ఇది తెలిసిన పోలీసులు అక్కడికెళ్లి సదరు వ్యక్తిని తీసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులపైనా స్థానికులు వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఓటర్లకు పంచకుండా మిగిల్చిన డబ్బును తమకు తెచ్చివ్వాలని క్షేత్రస్థాయి నాయకులను ప్రధాన నాయకులు అడగడం మరో చర్చనీయాంశం. ఈ విధంగా ఒక పార్టీకి చెందిన ప్రధాన నాయకునికి అదే పార్టీకి చెందిన చోటా నాయకుడు రూ.ఆరున్నర లక్షలు ఇచ్చారని, మరో పార్టీ నాయకునికి రూ.4 లక్షలు తిరిగి ఇచ్చినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా ఇతర ప్రాంతాల్లో ఉండే స్థానిక ఓటర్లను ఛార్జీలు ఇస్తామని చెప్పి రప్పించి తీరా ఓటేశాక డబ్బులివ్వకపోవడంపైనా పలువురు మండిపడుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఒత్తిడులను తట్టుకోలేక కొంతమంది గురువారం సాయంత్రమూ డబ్బు పంచుతుండగా మిగతావారు ఎవరెప్పుడు తమపై తగువు పెట్టుకుంటారోనని భయపడుతున్నారు.
అప్పట్లో ఓటకు రూ.5
ప్రజాశక్తి – రెంటచింతల
: ఓటు రేటు 52 ఏళ్లలో బాగా పెరిగిందని రెంటచింతలకు 17 ఏళ్లు సర్పంచ్‌గా వ్యవహరించిన అల్లం మర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 1972 సార్వత్రిక ఎన్నికల నుంచి ఓట్ల కొనుగోలు మొదలైందని చెప్పారు. అప్పట్లో రూ.ఐదు ఇస్తేనే ఎంతో సంతోషపడే వారమన్నారు. అభ్యర్థుల ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో రకమైన ధర ఉండేదన్నారు. ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితి రావడంతో ఎన్నికల్లో ధనవంతులు నిలబడటం ఆరంభమైందన్నారు. 2014 ఎన్నికల్లో ఒక్క ఓటుకు రూ.వెయ్యి ఇస్తే 2019లో రూ.1500 ఇచ్చారని, ఇప్పుడు రూ.3 వేలిచ్చారని చెప్పారు. భవిష్యత్‌లో ఇది ఎటు దారితీస్తుందోనని ఊహించడం కష్టంగా ఉందన్నారు.

➡️