ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు గుర్తింపుపై టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు మధ్య వాగ్వివాదం జరిగింది. మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈసందర్భంగా వైసీపీ కౌన్సిలర్ ఇంటి గోవిందరావు మాట్లాడుతూ కౌన్సిల్ ఆమోదానికి పెట్టిన అభివఅద్ధి పనులను ఏప్రాతిపదికన గుర్తించారని ప్రశ్నించారు. టీడీపీ వార్డులకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. దీనిపై స్పందించిన టీడీపీ కౌన్సిలర్ వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏకపక్షంగా వైసీపీ వార్డులకు నిధులు కేటాయించారని, టీడీపీ హయాంలో అన్ని వార్డులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పడంతో ఇరు పార్టీల కౌన్సిలర్లు మధ్య వాగ్వివాదం జరిగింది. రాజా కళాశాల రోడ్డులో కాలువలు కట్టకుండా రోడ్లు వేయడంతో రోడ్లు పాడైపోతున్నాయని టీడీపీ కౌన్సిలర్ రాంబార్కి శరత్ అన్నారు. అత్యవసరం లేని పనులకు ముందస్తు అనుమతులు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందని, అత్యవసర పనులకు మాత్రమే ముందస్తు అనుమతులు తీసుకోవాలని శరత్ అన్నారు. పైపులైన్ లీకులను నివారించాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ చెలికాని మురళి మాట్లాడుతూ కరెంట్ ఆఫీసు నుంచి ఇందిరమ్మ కాలనీ వరకు రోడ్డు పక్కన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జి.రమాదేవి మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు ఆక్రమణలను తొలగించాలని కోరారు. కలువలపై నిర్మాణాలు చేయడంతో పాటు షాపులు పెట్టడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. గొల్లవీధి రోడ్డు ఆక్రమణకు గురైందని చెప్పారు. టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గెంబలి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్కెట్ రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పని చేయాలని కోరారు. మేదరబంద జంక్షన్ వద్ద ఉన్న నుయ్యిపై ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ షాపు అద్దె చెల్లించేందుకు మున్సిపల్ ఆఫీసుకు వస్తే ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేదరబంద షాపుల యజమానులు రోడ్డును అక్రమిస్తున్నారని, తొలగించాలన్నారు. తమ వార్డు అభివఅద్ధికి నిధులు మంజూరు చేయడం లేదని 14వ వార్డు కౌన్సిలర్ ఎస్.లక్ష్మి అనగా నిధులు మంజూరు చేస్తామని చైర్మన్ మురళికఅష్ణ హామీ ఇచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించాలని వైసీపీ కౌన్సిలర్ చోడిగంజి రమేష్ నాయుడు కోరారు. టీడీపీ కౌన్సిలర్ వి.హైమవతి శ్రీచైతన్య స్కూల్ వద్ద స్కూల్ విడిచిపెట్టె సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నామని, వాహనాలు స్పీడ్ గా నడపడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ట్రాఫిక్ కంట్రోల్ చేయాలని కోరారు. మీగడవీధిలో కల్వర్టు నిర్మించాలని కోరారు. పలు అభివృద్ధి పనులకు ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశంలో వచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని చైర్మన్ మురళి, కమిషనర్ రామలక్ష్మి హామీ ఇచ్చారు. సమావేశంలో అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.