పాలక పక్షాలకు ఏసీసీ కార్మికుల గోడు పట్టదా ? : ఎసిసి కార్మికుల పోరాట కన్వీనర్‌ కూరపాటి స్టీవెన్‌

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్‌ (గుంటూరు) : గత 32 సంవత్సరాలుగా ఎసిసి కార్మికులు తమ న్యాయమైన సమస్యను పరిష్కరించాలని, అధికారుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్న, కోర్టు తీర్పు ఇచ్చినా కూడా కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో పాలక పక్షాలు పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నాయని, ఎసిసి కార్మికుల పోరాట కన్వీనర్‌ కూరపాటి స్టీవెన్‌ ఆవేదన వెలిబుచ్చారు. మంగళవారం తాడేపల్లి పట్టణ పరిధిలోని ఎసిసి కార్మికుల రిలే నిరాహార దీక్షలు 34వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను ఎసిసి కార్మికుల పోరాట కన్వీనర్‌ కూరపాటి స్టీవెన్‌, రాజధాని రైతు సంఘం నాయకులు టి బక్కిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీవెన్‌ మాట్లాడుతూ … ఆంధ్ర సిమెంట్‌ ఫ్యాక్టరీ అక్రమ లాకౌట్‌ అనంతరం కార్మికులు రోడ్డున పడ్డారని, కార్మిక కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎసిసి కార్మికులకు నష్టపరిహారం అందించేందుకు, న్యాయం చేసేందుకు చొరవ చూపలేదని ఆయన మండిపడ్డారు. అనారోగ్య సమస్యలతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ కొట్టుమిట్టాడుతున్న కార్మికులు ఆకలి కేకలతో చావాల్సిందేనా అని ఆయన విమర్శించారు. తక్షణమే ఎసిసి కార్మికుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలలో పల్లె పోగు జోసెఫ్‌, శీలం శంకర్రావు, కూరపాటి వెంకట మోహనరావు, కుంభాల వెంకటేశ్వర్లు, కుంభాల డేవిడ్‌ రాజు దీక్షలలో కూర్చున్నారు. ఈ దీక్షలకు మద్దతుగా బూరగా అంకయ్య, ఎం ఆశీర్వాదం, బి సూర్యప్రకాష్‌, కే ఆదినారాయణ, వి శాస్త్రి, సిహెచ్‌ పిచ్చయ్య, వై సాంబయ్య, రమాదేవి, శారమ్మ,దుర్గ భవాని, ఇమాంబి, శివకుమారి, మల్లేశ్వరి, హనుమంతరావు, గోపి, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.

➡️