ప్లాస్టిక్‌ నివారణకు సహకరించండి

Mar 21,2025 21:31

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌ : ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వాడకాల నివారణకు పట్టణ ప్రజలు, అన్ని వర్గాల వ్యాపారులు సహకరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌ వెంకటేశ్వర్లు కోరారు. శుక్రవారం ఆయన ప్రజారోగ్య విభాగం అధికారులు, సచివాలయాల శానిటరీ సెక్రటరీలతో కలిసి పట్టణంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌ వ్యాపారుల దుకాణాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్‌ నివారణకు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. వ్యాపారులు తమ వద్ద ఉన్న పాలిథిన్‌ కవర్లు, ప్యాకెట్లను స్వచ్ఛందంగా కమిషనర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వాడకాల వల్ల అన్ని వయసుల వారు క్యాన్సర్‌ బారినపడుతున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని, ప్లాస్టిక్‌ పాలిథిన్‌ వాడకాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రాష్ట్రంలోనే ప్లాస్టిక్‌ నివారణకు చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తుందని అన్నారు. ఇందులో భాగంగా మన్యం జిల్లాను ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ కృషి చేస్తున్నారని, ప్లాస్టిక్‌ వాడకాల నివారణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.

➡️