ప్రజాశక్తి -అనంతపురం క్రైం : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఆదివారం వేకువజామునే కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. సిఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్ల మరియు ఇతర రాష్ట్రాల మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో మరియు పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం… గ్రామసభలు నిర్వహించి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. మట్కా, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు. శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, అసాంఘిక కార్యకలాపాలను నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు.