ప్రజాశక్తి-మద్దిపాడు: రెవెన్యూ శాఖలో చేతులు తడపందే పనులు కావడం లేదు. ల్యాండ్ కన్వర్షన్ విషయంలో విఆర్‌ఒ రిపోర్టు లేకుండానే, తహశీల్దారు సెలవులో ఉండగా ఆర్‌ఐ, డిప్యూటీ తహశీల్దారు ఆర్‌డిఒకు ఫైల్ పంపారు. డబ్బుల పంపిణీ విషయంలో తేడా రావడంతో వారి అవినీతి బాగోతం బట్టబయలైంది. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారాయి. అందులో ఆర్‌డిఒ కార్యాలయ సిబ్బంది కూడా వాటా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామంలోని సర్వే నెంబర్ 30/1ఎఫ్‌లోని 7 ఎకరాల 19 సెంట్ల భూమికి కన్వర్షన్ కోసం విఆర్‌ఒ సంతకం లేకుండా తహశీల్దారు సెలవులో ఉన్న సమయంలో ఆర్‌ఐ, డిప్యూటీ తహశీల్దారు సంతకాలతో ఆర్‌డిఒ కార్యాలయానికి అప్రూవల్‌కు వెళ్లింది. అప్రూవల్ కోసం సుమారు రూ.3.50 లక్షలు చేతులు మారినట్లు సమాచారం. డిఆర్‌ఒ కార్యాలయానికి వెళ్లిన ఫైల్‌ను సిసి పరిశీలించి ఆర్‌డిఒకు పంపారు. ఈ క్రమంలో విఆర్‌ఒ తన సంతకం లేకుండా ఫైల్ అప్రూవల్‌కు ఎలా పంపారంటూ ఆర్‌ఐను, డిప్యూటీ తహశీల్దార్‌ను నిలదీశారు. దీంతో అసలు బాగోతం బయటపడింది. ఆర్‌ఐ, డిటీ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో ఈ విషయం తహశీల్దారుకు తెలిసింది. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు అధికారులు వివరణ పంపారు. మొదటి ఫైల్‌పై విఆర్‌ఒ సంతకం లేకపోయినా ఆర్‌ఐ రిపోర్టుతో డిప్యూటీ తహశీల్దారు చొరవతో ఈ కథ నడిచినట్లు సమాచారం.రెండో ఫైల్‌కు సంబంధించి సర్వే నెంబర్ 25లో 10 ఎకరాల 13 సెంట్లు ఫైల్‌కు సంతకాలు లేవంటూ ఆర్‌డిఒ తిప్పి పంపారు. అప్పుడు ఈ ఫైల్‌పై విఆర్‌ఒ, ఆర్‌ఐ, డిప్యూటీ తహశీల్దారు సంతకాలు చేయడంతో తహశీల్దారు పని సులువు అయింది. తహశీల్దారు వెంచర్ యజమాని వద్ద నుంచి లక్షా 70 వేలు తీసుకుని ఫైల్‌ను అఫ్రూవల్‌కు పంపినట్లు తెలిసింది. ఈ విషయంపై డిప్యూటీ తహశీల్దార్‌ను వివరణ కోరగా ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. డిటి తమను బెదిరింపులకు గురి చేస్తుందంటూ తహశీల్దారు, విఆర్‌ఒ శుక్రవారం జేసీని కలిసి ఫిర్యాదు చేశారు. స్పందించిన జేసీ ఈ వ్యవహరంపై విచారణకు ఎస్‌డిసి సోమవారం పంపుతామని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ల్యాండ్ కన్వర్షన్‌లో అవినీతికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
