ఘర్షణల్లో క్షతగాత్రులకు అభ్యర్థుల పరామర్శ

May 15,2024 00:34

ప్రజాశక్తి – వినుకొండ : ఎన్నికల సందర్భంగా టిడిపి-వైసిపి ఘర్షణల్లో గాయపడి ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్తలను ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు మంగళవారం పరామర్శించారు. టిడిపి నాయకులే గ్రామాల్లో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి పైసాచిక ఆనందం పొందుతున్న ఆ పార్టీకి వారికి చట్ట ప్రకారం బుద్ధి చెబుతామన్నారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని చెప్పారు. ఘర్షణలు జరక్కుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎన్నికలు సందర్భంగా పల్నాడు ప్రాంతంలో దాడుల వెనకున్న వైసిపి ఆరాచక శక్తుల్ని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి నరసరావుపే ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ, మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థులు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు డిమాండ్‌ చేశారు. ఘర్షణల్లో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న టిడిపికి కార్యకర్తలను వారు మంగళవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూజెండ్లలో పోలింగ్‌ అయిపోయాక ప్రశాంతంగా ఊళ్లో వైసిపి దుండగులు దాడులు చేశారని, టిడిపి కార్యకర్తను చంపడానికి యత్నించారని అన్నారు. ఆదివారం నూజండ్ల మండలం పాత చెరువు కొమ్ముపాలెం, రెడ్డికొత్తూరులో వైసిపి దాడిలో జెడ్‌పిటిసి సుబ్బులు భర్త జడ్డ రామయ్యతో పాటు పలువురుకి గాయాలైనట్లు చెప్పారు. వినుకొండలో దాడులను వైసిపి అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడే ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. త్రిపురాపురం, జంగాలపల్లి, కొత్తనాగిరెడ్డిపల్లి, ఉప్పలపాడు, కొచ్చెర్లలో దాడులు చేశారన్నారు. గుట్లపల్లి ఎస్సీ కాలనీలో మొత్తం అందర్నీ వెంటపడి కొట్టారని అన్నారు. జిల్లాలోని అన్నిచోట్ల దాడులపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయాలని, బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్లను జైల్లో పెట్టాలని కోరారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌ : టిడిపి శ్రేణులపై దాడులకు పాల్పడిన వైసిపి శ్రేణులపై చర్యలు తీసుకోవాలని ఎన్‌డిఎ కూటమి తరుపున సత్తెనపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లకీëనారాయణ డిమాండ్‌ చేశారు. నకరికల్లు, ముప్పాళ్ల మండలాల్లో గొడవలు జరిగి తీవ్రంగా గాయపడి నర్సరావుపేట ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్న వారిని లక్ష్మీనారాయణ మంగళవారం పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఆయనవెంట నాయకులు నాగౌతు శౌరయ్య ఉన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట : మండల పరిధిలోని కావూరు ఎస్సీ కాలనీ పోలింగ్‌ కేంద్రం వద్ద ఏజెంటుపై ఎన్‌డిఎ కూటమి నేతలు దాడులు చేశారని వైసిపి చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్‌ నాయుడు అన్నారు. క్షతగాత్రులను మంగళవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘర్షణపై వివరాలను బాధితులు ఆయనకు చెప్పారు. పోలింగ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభం కావడంతో సాయంత్రం ముగింపు సమయాన్ని కొంత పెంచాలని కోరామని, ఇందుకు టిడిపి వారు గొడవపెట్టుకుని కులం పేరుతో దూషించారని, దాడి చేశారని చెప్పారు. వైసిపి ఏజెంట్‌ నలమాల కాంతయ్య, కట్టెం ఆనందరావుకు తీవ్రంగా గాయాలయ్యాయని, మరికొందరికి కనిపించని దెబ్బలు తగిలాయని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం వచ్చిన తాము మంగళవారం వాటర్‌ప్లాంట్‌ వద్దకు తాగునీటి కోసం వెళితే రావద్దంటూ ఆంక్షలు విధించారని అన్నారు. దీనిపై మనోహర్‌నాయుడు మాట్లాడుతూ కాలనీ వాసులకు తాగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారంగా కాలనీలోని లూథరన్‌ చర్చి వద్దనే వాటర్‌ ప్లాంట్‌ను తన సొంత నిధులు రూ.6 లక్షలతో నిర్మిస్తానని చెప్పారు. అప్పటి వరకు ట్యాంకర్‌ ద్వారా నీటిని సరఫరా చేయిస్తామన్నారు. కార్యక్రమంలో కె.అనిల్‌, డి.శంకర్‌, చినబాబు, జి.యామలయ్య, కె.మస్తాన్‌రావు పాల్గొన్నారు.

➡️