భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి
చూపాలి నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలి.
తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ధర్నా
ప్రజాశక్తి – తిరుపతి టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని ఈరోజు శుక్రవారం ఉదయం తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం పార్టీ తిరుపతి నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి చిన్న అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కే వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయిందని అయితే సామాన్యుడు చేతికి ఉచిత ఇసుక ఇంకా దొరకడం లేదన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇసుక విక్రయయాన్ని రద్దుచేసి అందరికీ ఉచితంగా ఇస్తానన్న మాట ఎక్కడ అమలు కావడం లేదని 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని రాష్ట్రమంతా ఊదరగొట్టుకుంటున్న ఈ కూటమి కూటమి ప్రభుత్వం కార్మికుల పట్ల మంచి ప్రభుత్వంగా కాకుండా ముంచే ప్రభుత్వంగా ఏర్పడిందని అన్నారు. సామాన్యులకు అవసరమైన నాణ్యమైన ఇసుక లభించడం లేదని నాణ్యమైన ఇసుక కావాలంటే సుదూర ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్ ల వద్దకు వెళ్లాల్సి వస్తుంది అన్నారు.ఉచితం అన్న మాట పేరుకే తప్ప ఆచరణలో ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరే సరికి 6000 దాటుతోందన్నారు. ఇదే అదునుగా చూసి స్థానిక అవసరాల మాటున కొందరు కూటమి నేతలు ఏరులు వాగులు వంకలు ఆక్రమించుకుని ఏదేచ్ఛగా ఇసుక దందాను కొనసాగిస్తున్నారన్నారు.కూటమి ప్రభుత్వం తీసుకొచ్చే నూతన ఇసుక విధానం పేరుకి గొప్పగానీ ఆచరణలో మాత్రం గతం కన్నా ఏమీ గొప్పగా లేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్ 4 యూనిట్ల ఇసుక ధర పట్టణ ప్రాంతాల్లో 5000 నుంచి 6000 ఉండేది అని గ్రామీణ ప్రాంతాల్లో 3000 నుండి 4000 ఉండేదని అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితమే అయినా రెవెన్యూ ,పోలీసులు కొందరి కూటమి నేతలకు రాయల్టీ పోను పట్టణ ప్రాంతాల్లో 7000 కు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3000కు అందుతుంది. నాణ్యమైన ఇసుక కావాలంటే ఆదనంగా మరో వెయ్యి జమ చేయాల్సి వస్తుందన్నారు. ఇసుక కొరత అధిక రేట్ల వలన భవన నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవోడుతున్నది ఇళ్ల నిర్మానాలు చేసుకునే చిన్న మధ్యతరగతి వర్గాలు మీద భారం పడుతున్నదన్నారు. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశ పెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించిన దానికి ఆచరణకు పొంతన లేదు ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతున్నది ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఈ సమస్య జటిలం కాకముందే ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇసుకను ఉచితంగా ప్రజలందరికీ అంది ఇవ్వాలని నిర్మాణ రంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు పి బుజ్జి నగర కమిటీ సభ్యులు ఎం నరేంద్ర ఎండి శ్రీనివాసులు రాధాకృష్ణ నాయకులు శ్రీరాములు సుందరం శేషయ్య నారాయణస్వామి యూసఫ్ ప్రసాద్ బాదుల్లా ముజాఫర్ తదితరులు పాల్గొన్నారు.