పేదల భూములకు పట్టాలివ్వాలని సిపిఎం ధర్నా

ప్రజాశక్తి-కొత్తపట్నం కొత్తపట్నం మండలంలో పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, పట్టాలు ఇచ్చిన భూములను ఆన్లైన్‌ చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పెండింగ్‌ లో ఉన్న ఉపాధి హామీ కూలీల డబ్బులు బకాయి చెల్లించాలని, ఆటో కార్మికులకు స్టాండ్‌ ఏర్పాటు చేయాలని ఈ సమస్యల పరిష్కారం కోసం సిపిఎం ఆధ్వర్యంలో కొత్తపట్నం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పి ప్రకాశం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకురాలు కె రమాదేవి మాట్లాడుతూ మండలంలో భూ సమస్యను పరిష్కరించాలని కోరారు. ముఖ్యంగా ఈతముక్కల పేదలు 40 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్న సోమవరప్పాడు భూ సమస్యను వెంటనే రీ సర్వే చేసి సాగుదారులుగా గుర్తించి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కొత్తపట్నం ఆటో కార్మికులకు స్టాండ్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసిశారు. సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ స్వామిరెడ్డి మాట్లాడుతూ 1204 సర్వే నెంబర్లు ఉప్పు కొటారు భూములను ఆన్లైన్‌ ఎక్కించాలని కోరారు. మండలంలో ఆరు వారాల నుంచి పది వారాల వరకు ఉపాధి పెండింగ్‌ బిల్లులు ఆగిపోయి ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ పి మధుసూదనరావుకు అందజేశారు. ఈ సందర్భంగా తహశీల్దారు మధుసూదనరావు మాట్లాడుతూ ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధి పెండింగ్‌ బిల్లుల సమస్యను ఉపాధి ఏపీఓ కే నాగరాజు మాట్లాడుతూ ఈ వారంలో డబ్బులు వచ్చేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పి కృష్ణ, కే శీను, పి జైబాబు, జి జాను, సుబ్బులు, సులోచన తదితరులు పాల్గొన్నారు.

➡️