19న జిల్లా సమగ్ర అభివృద్ధిపై సదస్సు : సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : జిల్లా సమగ్ర అభివృద్ధి పై ఈనెల 19న సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ తెలిపారు. శుక్రవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో సదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా కడప జిల్లా సమగ్ర అభివృద్ధి-ప్రజా ప్రణాళిక అనే అంశంపై జిల్లా సదస్సు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆర్కే నగర్‌ లోని సిపిఎం కార్యాలయంలో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని తెలిపారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, ప్రధాన వక్తగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబురావు హాజరవుతారని చెప్పారు. జిల్లాలో ప్రాజెక్టులు, ప్రధాన కాలువలు పూర్తి కాలేదని పేర్కొన్నారు. నిధుల కొరతతో కూనరిల్లుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమ నడి ఒడ్డున ఉన్న కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటులో హామీ ఇచ్చారని, చట్టం చేశారని తెలిపారు. ఇంతవరకు అమలు చేయలేదని విమర్శించారు.

➡️