మదనపల్లి మెడికల్‌ కాలేజీ ప్రైవేటుపరంకాకుండా కాపాడుకోవాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ (అన్నమయ్య) : మదనపల్లె సర్వజన బోధనాసుపత్రిని ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడం ప్రజల బాధ్యత అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. 24 మంది స్టాఫ్‌ నర్సుల బదిలీలను నిరసిస్తూ … సోమవారం మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి ముందు సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మదనపల్లి మెడికల్‌ కాలేజీని ప్రభుత్వమే నిర్వహించాలని, సిబ్బంది బదిలీలు రద్దు చేయాలని, ధర్మాసుపత్రిని కాపాడుకుందాం అంటూ … పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంటకు పైగా రాస్తారోకో నిర్వహించడంతో చెన్నై- ముంబయి జాతీయ రహదారి, పటేల్‌ రోడ్డు పై వందల సంఖ్యలో వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఈ సందర్బంగా సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ … మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి గత వందేళ్లుగా ఎంతో మంది పేద రోగులకు వైద్య చికిత్సలు అందించి చరిత్రలో నిలిచిపోయిందన్నారు. పీలేరు, తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గ ప్రజలతో పాటు కర్నాటక ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికే వచ్చి వైద్యం చేయించుకుంటారన్నారు. రోజుకు 1200 నుంచి 1500 మంది అవుట్‌ పేషెంట్లుగా వైద్య సేవలు పొందుతున్నారని, మదనపల్లి ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ప్రభుత్వ ఆసుపత్రిని గత ప్రభుత్వం జిల్లా ఆసుపత్రిగా, తర్వాత రోజుల్లో సర్వజన బోధనాసుపత్రిగా అభివఅద్ధి చేయడంతో ప్రజలందరూ హర్షించారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్యశాలకు గ్రహణం పట్టిందని, ఇక్కడున్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజ్‌ ను ప్రైవేట్‌ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 44 మంది వైద్యులను, మరో 24 మంది స్టాఫ్‌ నర్స్‌ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంలోని అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. సర్వజన బోధనా ఆసుపత్రి వల్ల మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశం వస్తుందని, దూర ప్రాంతాలకు వెళ్లడం, సకాలంలో వైద్యం అందక చనిపోవడం లాంటి బాధల నుండి విముక్తి ఉంటుందని భావించిన ప్రజలపై కూటమి ప్రభుత్వం పిడుగు వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధనా ఆసుపత్రిని కాపాడుకోవడానికి ప్రజలు అందరూ ఐక్యంగా పోరాటం చేయాలని సిపిఎం ప్రారంభం చేసిన ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. ఐటీయూసీ నాయకులు కఅష్ణమూర్తి, సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌, ప్రముఖ న్యాయవాది సోమశేఖర్‌, ఆలం నాయకులు నూరుల్లా, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ నాయకులు నరసింహులు మాట్లాడుతూ … ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పేదలను వివిధ రకాల పరీక్షల పేరిట దోచుకుంటున్నారన్నారని, పేదలకు అండగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా ప్రైవేటుపరమైతే ఇక సామాన్యుడు వైద్యం చేసుకునే పరిస్థితి ఉండదన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని సర్వజన బోధన ఆసుపత్రి గానే ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజల మద్దతు కూడగట్టి మదనపల్లె బంద్‌ కూడా పిలుపునిస్తామన్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు, ఎమ్మెల్యే షాజహాన్‌ బాష స్పందించి ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివఅత్తి చేసి, మదనపల్లె సర్బజన బోధనాస్పత్రిని ప్రైవేటు పరం కానివ్వమని, ప్రభుత్వమే నిర్వహిస్తుందని ప్రజలకు నమ్మకాన్ని కలిగిస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయకుండా కూటమి ప్రభుత్వం పటిష్టం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, రఘునాథ్‌, మునివెంకటప్ప, నారాయణ, పవన్‌, ఆటో యూనియన్‌ నాయకులు నావాజ్‌, రమణ, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️