చల్లపల్లిలో సిపిఎం పాదయాత్ర

Mar 14,2025 13:45 #CPM march, #in Challapalli
  • పంచాయతీ కార్యాలయం ముందు కాలనీవాసుల నిరసన

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా స్థానిక సమస్యలను గుర్తించి, సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ … మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణరావు నగర్‌ కాలనీ నుండి పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గ్రామ సర్పంచ్‌ పైడిపాముల కృష్ణకుమారి, కార్యదర్శి పివి మాధవేంద్రరావు కు అందజేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి యద్దనపూడి మధు మాట్లాడుతూ … చల్లపల్లి పంచాయతీ పరిధిలోని నారాయణ రావు నగర్‌ గురుకుల పాఠశాల సమీపంలో జగనన్న కాలనీలో సమస్యలను పరిష్కరించాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. గురుకుల పాఠశాలల సమీపంలో తొమ్మిది అంతర్గత రోడ్లు అభివృద్ధి చేయాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని, అదే ప్రాంతంలోని కమ్యూనిటీ స్థలంలో ఉన్న జంగిల్‌ క్లియరెన్స్‌ చేసి కమ్యూనిటీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జగనన్న కాలనీలో గల లేఔట్లలో ఎల్‌ 1 నుండి 4 వరకు అన్ని రోడ్లు నిర్మాణం చేపట్టాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌ 3 రహదారిలో ఐదు కరెంటు స్తంభం ఏర్పాటు చేయాలని, డంపింగ్‌ యార్డ్‌ చుట్టు ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. తొలుతగా నారాయణరావు నగర్‌ కాలనీ నుండి పంచాయతీ కార్యాలయం వరకు ప్రదర్శన చేశారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు వాకా రామచంద్రరావు, మండల కమిటీ సభ్యులు బల్ల వెంకటేశ్వరరావు, మహమ్మద్‌ కరీముల్లా, నాయకులు నంద్యాల ప్రభు, వెనిగళ్ళ వసంతరావు, కలపాల దానయ్య నారం శివలీల,బనిగల బాలరాజు, ఆకుల అనురాధ, శీలం శ్రీనివాసరావు షేక్‌ హబీబున్నీ సా, పి.గణేష్‌ పాల్గొన్నారు.

➡️