ప్రజాశక్తి – రాయచోటి టౌన్ అధికార పార్టీ అండదందడలతో మైనింగ్ మాఫియా చెలరేగిపోయి ఇసుక, మట్టి కొల్లగొడుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. అధికారంలో ఉన్న పార్టీలు మారినా మైనింగ్ మాఫియా మారలేదని, ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరుతున్నారని విమర్శించారు. మంగళవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఉచిత ఇసుక విధానం కారణంగా జిల్లాలో ఉన్న ప్రజలకి ఇసుక అందుబాటులోకి లేకుండా పోయి ందన్నారు. భవన నిర్మాణం పనులు జరగడం లేదని భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. మైనింగ్ మాఫియా మాత్రం అధికార పార్టీ అండదండలతో పెద్ద ఎత్తున ఇసుకను తరలించకపోతున్నారని తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు టిప్పర్లతో రూ.లక్షల విలువ చేసే ఇసుకను తోడి, తరలిస్తున్నారని, అయినా అధి కారులు అటువైపు కన్నెత్తి చూడలేదని విమర్శిం చారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించ కపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతప్తి ఏర్పడిందని, అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై అగ్రహంతో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించారని పేర్కొన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. వందరోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయిందని, అన్ని ప్రాం తాల్లో ఇసుకను అక్రమంగా తోడేసి అమ్ముకున్నారని, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఇసుకను, మట్టిని అక్రమంగా తోడుకుని తరలించేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులకు కప్పం కట్టని ఇసుక ట్రాక్టర్లు మాత్రమే పోలీసులకు పట్టుబడుతున్నాయని, ఏకంగా మంత్రి కనుసన్నల్లో ఇసుక, మట్టి అక్రమాలు జరుగుతున్నాయని రాజంపేట నియోజకవర్గ నాయకులు సుగవాసి బాలసుబ్రమణ్యం ప్రకటించడం బట్టి చూస్తే ఇసుక, మట్టి అక్రమాల ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం అవుతోందని పేర్కొన్నారు. జిల్లాలో యథేచ్ఛగా ఇసుక, మట్టి అక్రమాలు జరుగుతున్నా ఒక్క టిప్పర్ కూడా అధికారుల కంట పడలేదంటే అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. మైనింగ్, ఎస్‌ఇబి, ఇరిగేషన్ రెవెన్యూ, పోలీసు అధికారులు మాఫియాతో కుమ్మక్కైనందువలన ఇసుక యథేచ్ఛగా తరలించకు పోగలుగుతున్నారని తెలిపారు. చిన్న చిన్న వాగులు కుంటల్లో పేదలు ఎత్తే ఇసుకను తీవ్రమైన ఆంక్షలు విధిస్తూ వేలకు వేలు ఫైన్లు వసూలు చేస్తున్నారు తప్ప, టిప్పర్లతో రూ.లక్షల విలువ చేసే ఇసుకను తరలిస్తున్న వారి జోలికి వెళ్లడం లేదని, అందుకనే ఒక్క టిప్పర్ కూడా మామూళ్ల మత్తులో జోగుతున్నందునే మైనింగ్, ఎస్‌ఇబి, ఇరిగేషన్ రెవెన్యూ, పోలీసు అధికారులకు కంటపడలేదని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు పలుచోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారని, ముఖ్యమంత్రి పదేపదే బహిరంగంగా హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా, అందరికీ అందుబాటులోకి ఇసుక తీసుకురావాలని, అవినీతిని అరికట్టాలని, భవన నిర్మాణాలు చేసుకునే వారిపై అధిక భారం లేకుండా చూడాలనీ కోరారు. జిల్లాలో ఇసుక అందరికి అందుబాటులో రావాలని, మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
