విజయవాడ : వరద సహాయం అందించడంపై కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని, ప్రజలకు తక్షణ సహాయం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబురావు డిమాండ్ చేశారు. అజిత్ సింగ్ నగర్, పాయకాపురంలోని శాంతినగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, ఎల్ బి ఎస్ నగర్, తదితర ప్రాంతాల్లో వరద బాధితులకు అండగా సిపిఎం ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ఆహార పంపిణీకి జనం వేలాదిగా తరలివస్తున్నారు. శనివారం కూడా భోజనానికి ప్రజలు ఎక్కువగా చేరుకున్నారు. కొంతమేరకు వరద నీరు తగ్గినప్పటికీ వివిధ కాలనీలలో ఇంకా రోడ్లపై మూడు అడుగుల నీరు ఉంది. మళ్లీ జోరున వర్షం కురుస్తుండటంతో ప్రజల కష్టాలు తీరడం లేదు. క్షేత్రస్థాయికి ప్రభుత్వ సహాయం అందడం లేదు. ఈ నేపథ్యంలో … ఆకలితో అలమటిస్తున్న సామాన్యుల కడుపును సిపిఎం నింపుతోంది. ఈరోజు ఉదయం బాబురావు, సిపిఎం నేతలు, ప్రజా సంఘాల కార్యకర్తలు కలిసి అజిత్ సింగ్ నగర్, పాయకాపురంలోని శాంతినగర్, ప్రకాష్ నగర్, వాంబే కాలనీ, ఎల్ బి ఎస్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ … వరద నీరు రెండు మూడు అడుగులు రోడ్లపై ఇంకా ఉందని, అత్యధిక ఇళ్లల్లో వంట చేసుకునే పరిస్థితి లేదన్నారు. వ్యర్ధాలు పేరుకుపోయి ఉన్నాయని, వ్యాధులు ప్రబలుతున్నాయని చెప్పారు. చేతిలో చిల్లి గవ్వలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ సరుకులు అత్యధిక చోట్ల పంపిణీ జరగలేదని తెలిపారు. అత్యధికమందికి ఈనెల పెన్షన్లు కూడా వరద వల్ల అందలేదని చెప్పారు. వ్యక్తిగత రవాణాహొ వాహనాలకు కొత్త వెసులుబాటు వచ్చినా కొద్ది మేరకు, ప్రజా రవాణా వాహనాలు అందుబాటులోకి రాలేదని తెలిపారు. ప్రజల ఇబ్బందులు కొనసాగుతున్నాయని వివరించారు. సిపిఎం ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్, పైపుల రోడ్డు రాయల్ బాంకెట్ ఫంక్షన్ హాల్ వద్ద భోజన పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతున్నదని చెప్పారు. నేడు కూడా సుమారు మూడువేల మందికి వేడివేడి భోజనం అందించామన్నారు. కేంద్ర మంత్రులు, బృందాలు పర్యటిస్తున్నా ఇప్పటి వరకు తక్షణ సహాయం ప్రకటించకపోవడం గర్హనీయమన్నారు. వరద హెచ్చరికలు చేయడంలో రెండవసారి కూడా ప్రభుత్వ యంత్రాంగం విఫలమయ్యిందన్నారు. గత వారం రోజులుగా వరద ప్రాంతాల్లో ప్రజలు నరకయాతన పడుతున్నారని, క్షేత్రస్థాయికి సహాయం ఇప్పటికీ పూర్తిగా అందటం లేదని అన్నారు. తక్షణ సహాయంతో పాటు వరద ముంపు నుండి శాశ్వత నివారణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. ప్రజల ఆవేదనను, ఆగ్రహాన్ని గమనించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షాలు, ప్రజా సంఘాలు, పౌర సంఘాలతో సమావేశం జరిపి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. వరద బాధితుల సమస్యలు తెలుసుకుని, పరిష్కరించాలన్నారు. దెబ్బతిన్న వాహనాలకు ఇన్సూరెన్స్ పరిహారం చెల్లింపు విషయంపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, వాటిని అమలు చేయాలని కోరారు. మున్సిపల్ ఉద్యోగులు ముంపుకి గురైన వారిని కూడా విధులకు హాజరు రావాలని కొందరు అధికారులు ఒత్తిడి చేయడం తగదని చెప్పారు. కూరగాయలతో పాటు ప్రభుత్వం ఇచ్చే సరుకులు కాకుండా ఇతర నిత్యవసరాలు తక్కువ ధరలకు అందించడానికి వీలుగా మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. దిగువ స్థాయిలో వైద్య శిబిరాలు ప్రారంభించాలన్నారు. వీలైన మేరకు బస్సులు ప్రజా రవాణా పునరుధ్ధరించాలని కోరారు. వరద తీవ్రత వివిధ ప్రాంతాల్లో హెచ్చు తగ్గుల్లో ఉన్నందున, ఆయా ప్రాంతాల స్థితికి అనుగుణంగా ప్రభుత్వ సహాయం అందాలని అన్నారు. వరద ముంపు లేని ప్రాంతాలలో సరుకుల పంపిణీ జరుగుతోందని కానీ వరద తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ సహాయం అందడం లేదని చెప్పారు. ప్రభుత్వం వాస్తవాలు గమనించి సేవా, సహాయ కార్యక్రమా సరిదిద్దటానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారులు, చేతివఅత్తులవారు తీవ్రంగా నష్టపోయినందున, వారిని ఆదుకోవటానికి కూడా తగు చర్యలు తీసుకోవాలని బాబూరావు డిమాండ్ చేశారు. నేడు జరిగిన పర్యటన, ఆహార పంపిణీ కార్యక్రమాల్లో సిపిఎం నేతలు బి.రమణరావు, సిహెచ్ శ్రీనివాస్, నిజాముద్దీన్, ఎన్.శ్రీనివాస్, సిహెచ్. వి.అప్పారావు, యువజన, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
వరద సాయంపై కేంద్రం మీనమేషాలు లెక్కించడం తగదు : సిపిఎం నేత సిహెచ్.బాబూరావు
