6, 7, 8 తేదీల్లో సిపిఎం పల్నాడు జిల్లా మహాసభ

Nov 30,2024 00:38

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : దేశ, రాష్ట్ర ప్రయోజనాలు, కార్మిక, కర్షక, బడుగు, బలహీన, అణగారిన వర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సిపిఎం నిరంతరం పోరాడుతుందని ఆ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌ అన్నారు. నరసరావుపేట పట్టణం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. 6, 7, 8 తేదీల్లో నరసరావుపేట పట్టణంలో ప్రకాష్‌ నగర్‌లోని షాదీఖానాలో సిపిఎం 25వ జిల్లా మహాసభ జరుగుతుందని, జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మహాసభ ప్రారంభ సూచికగా 6వ తేదీన నరసరావుపేటలోని కోట సెంటర్‌ నుండి పల్నాడు బస్టాండ్‌ వరకు ప్రదర్శన అనంతరం పల్నాడు బస్టాండ్‌ వద్ద బహిరంగ సభ ఉంటుందని చెప్పారు. సభకు ప్రధాన వక్తలుగా రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, రాష్ట్ర కమిటి సభ్యులు వి.కృష్ణయ్య, హరికిషోర్‌ హాజరవుతారని తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, అనాలోచిత నిర్ణయాలతో దేశానికి, రాష్ట్రానికి వాటిల్లే నష్టాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం చేపట్టాల్సిన పోరాటాలు, తీర్మానాలు, కార్యాచరణను ఈ సందర్భంగా రూపొందిస్తామన్నారు. దోపిడీ వర్గ రాజకీయలను అంతమొందించడం సిపిఎం ద్వారానే సాధ్యమన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు పారిశ్రామిక, వ్యవసారంగాలను దివాలా తీశాయన్నారు. విద్య, వైద్యం సామాన్యులకు అందని ద్రాక్షలా మారిందన్నారు. ఆర్థిక అసమానతలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని, దేశ ప్రజలు చెమటోడ్చిన కష్టంతో చెల్లించిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, అదాని లాంటి బడా కార్పొరేట్‌ సంస్థలకు అప్పనంగా అమ్మేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, ప్రజల హక్కులపై, రాష్ట్రాల హక్కులపై, రాజ్యంగంపై దాడి జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో తాత్సారం చేస్తున్న నేపథ్యంలో దీనిపై సిపిఎం పోరాడుతుందని అన్నారు. పల్నాడు జిల్లాలో పేదలందరికీ కూడు, గూడు కోసం, నకిలీ విత్తనాలు భారిన పడి నష్టపోయిన రైతులు పక్షాన, రైతుల వద్ద దళారులు పంటలు కొని డబ్బులు ఇవ్వని ఘటనల్లో బాధితుల పక్షాన సిపిఎం పోరాడి న్యాయం చేసేందుకు కృషి చేసిందన్నారు. తాగు, సాగు నీటి అవసరాలు తీర్చే వరికపూడిసెల ప్రాజెక్టు సాధనకు వరికపూడిసెల జల సాధన సమితి ద్వారా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతామన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోసం నిధులివ్వాలని సిపిఎం పోరాడిందని, ప్రజాపోరు ప్రచార యాత్ర ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రభుత్వాధికారులకు నివేదించామని చెప్పారు. స్కీమ్‌ వర్కర్లు చిరుద్యోగులపై రాజకీయ వేధింపులపై పోరాడింది సిపిఎం మాత్రమేనని గుర్తు చేశారు. మైనింగ్‌ పేరుతో నాటి ప్రభుత్వ చర్యల వల్ల భూములు కోల్పోయిన యడవల్లి రైతులకు భూ సేకరణ చట్ట-2013 ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని ఉద్యమించిందన్నారు. రైతు, కార్మిక, వ్యవసాయ కూలి, విద్యార్థులు, యువకులు, మహిళలు, ఇతర అన్ని రంగాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం సిపిఎం నిత్యం పోరాటాలు చేస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న జిల్లా మహాసభ జయప్రదానికి అందరూ సహకరించాలని విజరుకుమార్‌ కోరారు.

➡️