వార్డుల వారీగా సమస్యలపై సిపిఎం వినతి

Nov 28,2024 00:24

ప్రజాశక్తి-చిలకలూరిపేట : పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్‌ కమిషనర్‌ పి.శ్రీహరిబాబుకు సిపిఎం నాయకులు బుధవారం వినతిపత్రం ఇచ్చారు. ఇటీవల ఆ పార్టీ ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించగా స్థానికులు తెలిసిన సమస్యలపై కమిషనర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కన్వీనర్‌ పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 12వ వార్డు తూర్పు మాలపల్లిలో చర్చి పక్కన ఉన్న 90 సెంట్లలో ఉన్న మురుగు కాల్వ నీటిని చార్లెస్‌ కాన్వెంట్‌ ఎదురుగా ఉన్న పెద్ద కాల్వలో కలిసేలా మరో కాల్వ నిర్మించాలని కోరారు. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ కాలనీలో పార్కు నిర్మించాలని, చంద్రమౌళి పార్క్‌ వెనుక వైపున శ్మశాన వాటిక వెనక బజారు కలుపుతూ రోడ్డు వేయాలని, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారానే నీటిని సరఫరా చేయాలని కోరారు. 17వ వార్డులో ప్రగతి స్కూల్‌ ఎదురుగా ఉన్న స్థలంలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయించాలని, రాచుమల్ల నగర్‌లోని గవర్నమెంట్‌ హాస్పిటల్‌ ప్రక్కన రోడ్డు వేయాలని, 25వ వార్డులో అంకమ్మ చెట్టు వద్ద గల బావి దగ్గర ఉన్న బోరింగ్‌ను బాగు చేయించాలని విన్నవించారు. అంకమ్మ చెట్టు వద్ద రోడ్డు ఇరువైపులా ఉన్న వారికి ఇంటి పన్నులు వేయాలని, నీటి కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలని కోరారు. జనాభా పెరుగుతున్న నేపథ్యంలో పారిశుధ్య కార్మికులను పెంచాలని, అన్ని ప్రాంతాల్లో సైడు కాల్వలు, విద్యుత్‌ దీపాలటు ఏర్పాటు చేయాలని, భూగర్భ డ్రైనేజీ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పేదలకు రూ.5 లక్షలతో ఇళ్లు కట్టివ్వాలని, చీరాల రూట్‌లో నరసింహస్వామి గుడి వద్ద రోడ్డులో రోడ్డును సరిచేయాలని కోరారు. 40 ఏళ్ల క్రితం వేసిన తాగునీటి పైపులైన్లలను మార్చి కొత్తవాటిని వేయాలన్నారు. కార్యక్రమంలో టి.ప్రతాప్‌రెడ్డి, ఎస్‌.లూథర్‌, ఎస్‌.బాబు, జె.రాజశేఖర్‌ పాల్గొన్నారు.

➡️