ప్రజాశక్తి-ములగాడ : జివిఎంసి 59వ వార్డు పరిధి నెహ్రూనగర్‌లో సిపిఎం మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యాన ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. సిపిఎం కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలపై సర్వే నిర్వహించారు. ఇళ్ల పట్టాలు, పక్కా గృహాలు కట్టుకోలేని వారికి స్కీములు కావాలని, ఇంటి పన్నుల పేర్లు మార్పు చేయాలని, పెంచిన కరెంటు చార్జీల భారాలు తగ్గించాలని, నెహ్రూనగర్ గెడ్డ పక్కన ఉన్న ఇళ్లకు రిటర్నింగ్‌వాల్ కట్టాలని స్థానికులు సిపిఎం నాయకుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం మల్కాపురం జోన్ నాయకులు ఆర్.లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్ధానాలు చేయడమే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు తప్ప ఇల్లు, స్థలం ఇవ్వడంలేదన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి కోసం రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు కట్టించుకున్నారని, అయినా వారికి ఇల్లు లేదు, డబ్బులు లేవని తెలిపారు. సర్వేలో వచ్చిన సమస్యలను దరఖాస్తుల ద్వారా సచివాలయం, తహశీల్దార్, మున్సిపల్ అధికారులకు తెలియజేసేందుకు సిపిఎం నిర్వహించే ధర్నా కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జె.రామనాయుడు, డి.రాజేష్, యు.రాజు, ఎం.శ్రీనివాసరావు, బి.రాంబాబు, కె.రమణ, జి.రామకృష్ణ, ఎ.ప్రశాంత్, దుర్గారావు, సిహెచ్.పైడినాయుడు, జె.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
