ఉచిత ఇసుక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి-అనకాపల్లి : రాష్ట్రంలో టిడిపి, జనసేన కూటమి ఇచ్చిన ఎన్నికల వాగ్ధానం ప్రకారం ఉచిత ఇసుక ఇవ్వాలని, ఇసుక సమస్య నివారించాలని, కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అకోటబర్ 4న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనల్లో బాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాని పార్టీ శ్రేణులకు అనకాపల్లి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగి విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతప్తి ఏర్పడిరది. ప్రజల సమస్యలు పట్టకుండా, కనీసం భవన నిర్మాణాలు చేస్తున్న ప్రజలకు గాని, ఈ రంగంపై ఆధారపడిన కార్మికులకు గాని ప్రయోజనం లేకుండా చేయడంతో ఆ ప్రభుత్వంపై అగ్రహంతో వైసిపి ప్రభుత్వాన్ని గద్దెదించారు. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలనలో ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడాలేకుండా పోయింది. అనేకచోట్ల ఇసుక లభించడం లేదని, రవాణా ఛార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదు. కొన్ని చోట్ల గతం కంటే అధిక ధరలకు ఇసుకను కొనుక్కొవలసి వస్తోంది. ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలు ఇసుకపై పెత్తనం చేస్తున్నారు. ఇసుక కొరత, అధిక రేట్ల వలన భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతోంది, ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న, మధ్యతరగతి వర్గాలపై భారం పడుతుంది. ఇసుక ఆన్లైన్ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రకటించించినా ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణకు పొంతనలేకుండా ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతోంది.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని, అందరికీ ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి, భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలని సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నది. వీటి సాధన కోసం అక్టోబర్ 4న జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం కోరింది.