బడ్జెట్‌లో ద్రోహంపై సిపిఎం నిరసనలు

Feb 2,2025 20:49

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ :  పార్లమెంట్‌లో కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం చేసేదిగా ఉందని సిపిఎం నాయకులు బివి రమణ, గొర్లి వెంకటరమణ విమర్శించారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కలెక్టరేట్‌ ఎదుట కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలైన గిరిజన యూనివర్సిటీ, ఐఐటి, ఎన్‌ఐటి, త్రిబుల్‌ ఐటి, కడప ఉక్కు పరిశ్రమకు కనీస కేటాయింపులు కూడా ఈ బడ్జెట్‌లో చేయలేదని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గతంలో కేటాయించిన కేటాయింపుల కంటే తక్కువ కేటాయించారని, రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన విశాఖ రైల్వేజోన్‌ కు, మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు ఈ బడ్జెట్‌లో చేయలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో చేయలేదని విమర్శించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో ప్రపంచ బ్యాంకు నుంచి ఇచ్చిన అప్పు తప్ప బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి, మౌలిక వసతులు కల్పనకు, నీటి పారుదల ప్రాజెక్టులకు ఎలాంటి కేటాయింపులు కూడా ఈ బడ్జెట్‌లో చేయకపోవడం విచారకరమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని ఎల్‌ఐసితో సహా ఇతర ఇన్సూరెన్స్‌ సంస్థలను 100 శాతం ప్రైవేటీకరించేందుకు ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడం మరీ దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చని ఈ బడ్జెట్‌ను అధికార కూటమి సమర్ధించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చేలా కేటాయింపులు చేసేందుకు పూనుకోవాలని లేనిచో ఈ ప్రభుత్వం కూడా ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దావాల రమణారావు, ఎం.ఉమా మహేశ్వరి, బంకురు సూరిబాబు, సంచాన ఉమాహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సాలూరు రూరల్‌ : కేంద్ర బడ్జెట్‌కు నిరసనగా సిపిఎం ఆధ్వర్యాన మండలంలోని జిల్లేడువలసలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో కేవలం వారికి అనుకూలురైన కార్పొరేట్‌ వ్యక్తులకు మాత్రమే పనికొచ్చేలా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారని, దీంతో దేశంలో మెజార్టీ వర్గంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి లబ్ధిచేకూరకుండా చేస్తున్నారని విమర్శించారు. పేద లపై భారాలు వేసి కార్పొరేట్‌ పెట్టుబడిదారులకు రాయితీలు అందించి వారి మెప్పును పొందుతున్నారని, రాష్ట్రానికి ద్రోహం చేసిన కేంద్ర బడ్జెటును రాష్ట్రానికి ఎటువంటి కేటాయింపులు చేయకపోవడం సరికాదని అన్నారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు ఇచ్చిన హామీలకు అనుగుణంగా కేటాయింపులు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సీదరపు అప్పారావు, గెమ్మేల జానకిరావు, బాబాయి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

కొమరాడ : కేంద్ర బడ్జెట్‌ లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం నాయకులు ఉపేంద్ర అన్నారు. స్థానిక జూనియర్‌ కాలేజ్‌ సెంటర్‌ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారంటూ నిరసన చేపట్టారు. ఈ నిరసననుద్దేశించి వీరు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గొప్పలు మానుకొని రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు సక్రమంగా కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

పాలకొండ : పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసేదిగా ఉందని సిపిఎం నాయకులు దావాలా రమణారావు విమర్శించారు. స్థానిక విలేకరులతో మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న కేంద్ర విద్యా సంస్థలైన గిరిజన యూనివర్సిటీ, ఐఐటి ఎన్‌ఐటి ,త్రిబుల్‌ ఐటీ, కడప ఉక్కు పరిశ్రమకు కనీస కేటాయింపులు కూడా ఈ బడ్జెట్‌ లో చేయలేదని, విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కు గతంలో కేటాయించిన కేటాయింపుల కంటే తక్కువ కేటాయింపులు చేశారని, ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన విశాఖ రైల్వే జోన్‌ కు, మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఎలాంటి కేటాయింపులు ఈ బడ్జెట్‌ లో చేయలేదని విమర్శించారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించాల్సిన కేటాయింపులు కూడా ఈ బడ్జెట్లో చేయలేదని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని అధికార కూటమి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విభజన చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చేలా కేటాయింపులు చేసేందుకు పూనుకోవాలని, లేకుంటే ఈ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు కాదా రాము, దూసి దుర్గారావు, ఎ.భానుచందర్‌, ఎ.లక్ష్మణరావు, ఎం.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️