ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఆంధ్ర రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం చేసిన కేంద్ర బడ్జెట్‌ను నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన జిల్లా అంతటా నిరసనలు తెలిపారు. ఆదివారం విజయనగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.జగన్మోహనరావు, పి.రమణమ్మ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ మన రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. విశాఖ ఉక్కుకు గత బడ్జెట్ కంటే నిధులు తగ్గించిందన్నారు. మన జిల్లాలో ఏర్పాటు చేసిన గిరిజన యూనివర్సిటీకి నిధులు కేటాయింపు చేయకపోవడం అన్యాయ మన్నారు. పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించలేదన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించే విధంగా బడ్జెట్‌లో లేదన్నారు. ఉపాధి హామీ పథకానికి గత బడ్జెట్ కంటే కేటాయింపులు తగ్గించి ఉపాధి కూలీలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రైల్వేజోన్, విభజన చట్టంలోని అంశాల గురించి కనీస ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. భీమా రంగంలో 100 శాతం ఎఫ్‌డిఐలు అనుమతించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు,రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసే బడ్జెట్‌ను ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. అదే విధంగా కూటమి ప్రభుత్వం లో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.రమణ, వి.లక్ష్మి, రామచంద్రరావు, రాము, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గజపతినగరం : కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా గజపతినగరంలో సిపిఎం జిల్లా నాయకులు జి.శ్రీనివాస్, మెంటాడ మండల కన్వీనర్ రాకోటి రాములు ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కార్పోరేట్లకు అనుకూలంగా, కార్మిక, కర్షక, పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. బడ్జెట్‌లో మన రాష్ట్రానికి, జిల్లాకి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. గ్యాస్, ఎరువులు, ఆహార సబ్సిడీలకు బడ్జెట్ కేటాయింపులు తగ్గించారని తెలిపారు. గిరిజన యూనివర్సిటీ అత్యంత నిర్లక్ష్యానికి గురైందన్నారు. మోడీ పాలనలో బడ్జెట్ మోసాన్ని ప్రజలు ఎదిరించి, హక్కులను, బడ్జెట్‌ను ఆయా రంగాల ప్రజలు పోరాడి సాధించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కనకరాజు, గోవింద్, సూర్యనారాయణ, శ్రీను, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కొత్తవలస : కొత్తవలసలోని గాంధీనగర్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం జిల్లా నాయకులు గాడు అప్పారావు ఆధ్వర్యాన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి గాని, కార్మిక వర్గానికి గాని, రైతాంగానికి గాని బడ్జెట్‌తో ఒరిగిందేమీ లేదన్నారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ నిధుల్ని దారిమళ్లించి, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, రైతాంగానికి అనుకూల బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మద్దిల రమణ, మండల కమిటీ సభ్యులు పివి రమణ, వంక ఆదినారాయణ, సబ్బవరపు హరీష్, గాడి సురేష్, మునూరు రాజు, కందిపిల్లి తాతబాబు, తదితరులు పాల్గొన్నారు.