అన్యాక్రాంత భూములను పేదలకు పంచాలి : సిపిఎం

Mar 21,2025 21:02

 ప్రజాశక్తి – మక్కువ : పేదలు సాగు చేస్తున్న డి-పట్టా భూములను. అన్యాక్రాంతం చేసిన వారిపై చర్యలు తీసుకొని పెత్తందారులు ఆక్రమించుకున్న భూములను పేదలకు పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.గంగునాయుడు డిమాండ్‌ చేశారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం ఆయనతో పాటు సిపిఎం నాయకులు ప్రభాకర్‌, సింహాచలం, గోపి, చంటి శంబర, మూకవలస, మోసూరువలస, తూరుమామిడి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లి గంగు నాయుడు మాట్లాడుతూ శంబరంలో 25 ఎకరాల డి-పట్టా పేదల భూములను పెత్తందారులు ఆక్రమించుకున్నారని, వెంటనే ఆ భూములను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే తూరుమామిడిలో 20 ఎకరాల డి-పట్టా భూములను పెత్తందారులు ఆక్రమించుకున్నారన్నారు. అలాగే అన్యాక్రాంతమైన భూములను వెంటనే పేదలకు పంపిణీ చేసేలా రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గిరిజన ప్రాంతాల్లో సాగు చేస్తున్న పేదల భూములకు నేటికీ పట్టాలివ్వకపోవడం వల్ల భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు తహశీల్దార్‌ కార్యాలయానికి వినతులిచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 24న స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగే కార్యక్రమానికి పేదలంతా కదలి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటికైనా పేదలకు భూములు పంపిణీ చేయాలని, సాగు చేస్తున్న భూములకు పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మరిన్ని పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు, గిరిజనులు, దళితులు పాల్గొన్నారు.

➡️