చెక్‌డ్యామ్‌ను నిర్మించి పొలాలకు నీరివ్వాలి : సిపిఎం

Oct 2,2024 00:18

ప్రజాశక్తి – వినుకొండ : మండలంలోని విఠంరాజుపల్లి సిపిఎం గ్రామ మహాసభ మంగళవారం వీరపనేని నగర్‌లో అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఆ పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా రైతులకు ప్రభుత్వం ఇస్తామన్న రూ.20 వేల పెట్టుబడి సాయం ఇంకా ఇవ్వలేదని అన్నారు. పలు సమస్యల పరిష్కారాన్ని డిమాండ్‌ చేస్తూ మహాసభ తీర్మానాలను ఆమోదించింది. విఠంరాజుపల్లిలోని 2.50 ఎకరాలను శ్మశాన స్థలాన్ని విభజించి ఎస్సీలకు సగం, ఓసీ, బీసీలకు సగంగా కేటాయించాలని కోరారు. గణేష్‌పాలెం వద్ద కంలేరు వాగు చెక్‌ డ్యాం నిర్మించి 3 వేల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని, కప్పకొండ చెరువు భూముల్లో ఆక్రమణలు అరికట్టి నడిగడ్డ ఎస్సీ కాలనీ వాసులకు న్యాయం చేయాలని, తిమ్మాయపాలెం భారతపురం నడిగడ్డ వరకు, రామలింగాపురం గణేష్‌పాలెం ఆంజనేయ స్వామి గుడి వరకు తారు రోడ్డు నిర్మించాలని తీర్మానించారు. అనంతరం శాఖ కార్యదర్శిగా పెనుమాల వెంకటేశ్వర్లును తిరిగి ఎన్నుకున్నారు. తొలుత సిపిఎం జెండాను ఎగురవేశారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధాన సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. కె.హనుమంత్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, పి.వెంకటేశ్వర్లు, సాల్మన్‌, కె.ఏడుకొండలు, బి.లక్ష్మీ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – బెల్లంకొండ : సిపిఎం మండల మహాసభ నిర్వహించగా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.రవిబాబు, నాయకులు జి.మల్లీశ్వరి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై తీర్మానాలను మహాసభ ఆమోదించింది. బెల్లంకొండ-క్రోసూరు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని, వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, పెట్టుబడి సాయం రూ.20 వేలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా చిన్నం పుల్లారావును ఎన్నుకున్నారు. తొలుత సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.

➡️