ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగర పాలక సంస్థ 42 వ డివిజన్ స్వామినగర్ పరిసర ప్రజల రాకపోకలకు పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం కాకినాడ నగర కమిటీ డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ స్వామినగర్ ప్రాంతం 2015 లో కాకినాడ నగర పాలక సంస్థ లో విలీనమైందన్నారు. నగరానికి స్వామినగర ప్రాంతానికి తూరల వంతెన నిర్మించి చాలా కాలమైందన్నారు. గతంలో వంతెన ఐరన్ గ్రిల్ పాడైనప్పుడు ఇంద్రపాలెం మన ఊరు మన బాధ్యత సంస్థ వారు రిపేరు చేయించారని తెలిపారు. ప్రస్తుతం వంతెన రిపేర్ వల్ల రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. స్వామినగర్ నుండి విద్యార్థులు కాకినాడ లో చుదువుకుంటారని, స్వామినగర్ పరిసర ప్రాంతాలు కూడా ఇటీవల అభివృద్ధి చెందడం వల్ల వంతెన పై ట్రాఫిక్ పెరిగిందన్నారు. వంతెన రిపేర్ వల్ల ట్రాఫిక్ కి అంతరాయం జరుగుతుందని, ప్రమాదకరంగా కూడా ఉందన్నారు. అదేవిధంగా వంతెనకు ఇరువైపులా అపారిశుధ్యం తాండవిస్తుందన్నారు. గౌరవ నగర పాలక సంస్థ కమిషనర్ స్పందించి యుద్ధ ప్రాతిపదికన స్వామినగర్ ప్రాంతానికి పక్కా వంతెన నిర్మించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తోందన్నారు. అదేవిధంగా ఆ ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని వీరబాబు ఆ ప్రకటన లో కోరారు.