ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : పేదలు నివాసమున్నచోటే పట్టాలిచ్చి ఇళ్లు కట్టి ఇవ్వాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. నగరంలోని రామకృష్ణా నగర్ శాఖా మహాసభ మంగళవారం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం శంకకర్రావు మాట్లాడుతూ మోడీ పాలనలో దేశంలో రాజ్యాంగం దెబ్బ తింటోందన్నారు. ధరలు పెరిగి పేదల బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీ కరణ చేసి అదాని, అంబానీ సేవలో ఉన్న మోడీకి దేశం , ప్రజలు గురించి ఆలోచించే తీరిక లేదని అన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకు నోచుకోలేదని అన్నారు. అందుకే ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమన్నారు. అనంతరం అందరికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని, అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు, స్టాఫ్ తగినంత మందిని నియమించాలని, జిల్లా కేంద్రాస్పత్రిలో హార్ట్, యురాలజీ , న్యూరాలజి, కేన్సర్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వేయాలనే ప్రతి పాదనను విరమించి కోవాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మ, శాఖాకార్యదర్శి ఎం.జగదాంబ, శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు.