ప్రజాశక్తి-పిడుగురాళ్ల : పట్టణ శివారులో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదార్లకు వెంటనే ఇవ్వాలని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏపూరి గోపాలరావు డిమాండ్ చేశారు. సిపిఎం పిడుగురాళ్ల, మాచవరం మండల కమిటీల సమావేశం జె.రమణ అధ్యక్షతన స్థానిక ప్రజాశక్తి నగర్‌లోని సిపిఎం కార్యాలయంలో బుధవారం నిర్వహించాఉర. అనంతరం గోపాలరావు విలేకర్లతో మాట్లాడుతూ 2018లో 4480 గృహాలకు శంకుస్థాపన చేశారని, ప్రస్తుతం 300 అడుగుల వైశాల్యం గల ఇళ్లు 2016 నిర్మాణంలో ఉన్నాయని, 360 అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఇళ్లు 816, మొత్తంగా 2832 గృహాలు నిర్మించారని చెప్పారు. వీటికి సంబంధించి విద్యుత్, శానిటరీ తదితర పనులు అసంపూర్తిగా ఉండటంవల్ల నివాసానికి అనువుగా లేవని, ఆ పనులను సత్వరం పూర్తి చేసి లబ్ధిదార్లకు అప్పగించాలని కోరారు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు వ్యవహరించాలన్నారు. రెక్కల కష్టాన్నే నమ్ముకున్న పేదలు ఎంతో ఆశతో రూ.వేలకువేలు చలానాలు చెల్లించి నేటికీ ఇళ్లు దక్కక నిరాశలో ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు కేటాయించడంతోపాటు ఇళ్లు నిర్మించాలని కోరారు. లేకుంటే ఆందోళనకు పూనుకుంటామన్నారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు, షేక్ మస్తాన్‌వలి, బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.